Trump Tariff Bomb: మరోసారి సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్‌..

ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు భారీ దెబ్బ!;

Update: 2025-08-01 01:45 GMT

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్ట్ 1 నుంచి భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్ వల్ల ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ రంగాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌-అమెరికా ట్రేడ్ సర్ప్లస్‌పై లక్ష్యంగా ట్రంప్ చర్యలు చేపట్టారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో వ్యాఖ్యానిస్తూ.. భారత్ మిత్ర దేశమయినప్పటికీ, గతంలో తక్కువ వ్యాపారమే జరిగిందని.. ఎందుకంటే, వారి టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, నాన్-మానిటరీ ట్రేడ్ బారియర్స్ కూడా ప్రపంచంలోనే అత్యధికంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేగాక, భారత్-రష్యా సంబంధాలు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.

2025 ఆర్థిక సంవత్సరానికి గాను, అమెరికాతో భారత ట్రేడ్ సర్ప్లస్ 41.18 బిలియన్ డాలర్స్ దాటింది. ఇందులో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 11.6 శాతం పెరిగి 86.5 బిలియన్ డాలర్స్ కు చేరుకోగా.. దిగుమతులు 7.4 శాతం పెరిగి 45.3 బిలియన్ డాలర్స్ కు చేరుతుంది. ఈ పెరిగిన వ్యత్యాసాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయమై ఎలారా కాపిటల్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ ప్రకారం.. ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి పోటీ దేశాలపై తక్కువ టారిఫ్‌లు ఉంటే, భారత్‌పై 25% టారిఫ్ విధించడం ఆర్థికంగా నష్టాన్ని తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు.

అమెరికాకు భారత్‌ ఎగుమతిచేసే టాప్-5 ఉత్పత్తులు ఇలా ఉన్నాయి. ఇందులో మొదటగా.. 2025 రెండో త్రైమాసికంలో భారత్, చైనాను అధిగమించి అమెరికాకు అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ సరఫరాదారుగా మారింది. భారత స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధర, అధిక ఫీచర్లతో అమెరికాలో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. జనవరి 2025 నాటికి ఈ రంగం 3 బిలియన్‌ డాలర్స్ కు పైగా ఎగుమతులు సాధించింది. దీని తర్వాత ఆసియాలో రెండో అతిపెద్ద రిఫైనింగ్ హబ్‌గా భారత్ పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, గ్యాసొలిన్, ఎల్‌పీజీ వంటివి అమెరికాకు భారీగా ఎగుమతిస్తోంది. 2024 నాటికి ఈ రంగం 20 బిలియన్ డాలర్స్ ఎగుమతుల విలువ సాధించింది.

అలాగే అమెరికా భారత ఆభరణాలకి అతిపెద్ద కొనుగోలుదారు. డైమండ్లు, బంగారు నగలు సహా రఫ్ రత్నాలు, హస్త కళా మాణిక్యాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంటుంది. గత ఏడాది ఈ రంగం 8.5 బిలియన్ డాలర్స్ దాటి ఎగుమతులు చేసింది. ఇక భారత్‌ ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా జెనరిక్ మందులు, వ్యాక్సిన్లు, API లు అమెరికాకు అందిస్తోంది. 2025 నాటికి భారత ఫార్మా ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్స్ దాటాయి. అలాగే సిల్క్ హ్యాండ్లూమ్స్‌ నుంచి కాటన్ గార్మెంట్ల వరకు, అమెరికా మార్కెట్‌లో భారత బట్టలకు మంచి గిరాకీ ఉంది. 2025లో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్స్ పైగా ఎగుమతులు నమోదు చేసింది.

కాబట్టి ట్రంప్ కొత్త టారిఫ్ విధానం భారత వ్యాపార రంగాలకు గట్టి దెబ్బగా మారనుంది. ఎగుమతులపై ఆధారపడి ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆభరణాలు, టెక్స్టైల్ ప్రధాన రంగాలు ఈ టారిఫ్ బాంబుతో నష్టాన్ని మూటగట్టుకునే అవకాశముంది. దీనికి వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం, వ్యాపార సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. ఈయూ దేశాల మధ్య చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలే ఈ సమస్య నుండి భారత పరిశ్రమలకు ఊతం కానున్నాయి.

Tags:    

Similar News