PAK: పాక్‌లో ఆత్మాహుతి దాడి...44 మంది మృతి
రాజకీయ పార్టీ బహిరంగ సభలో పేలుడు.... కీలక నేత సహా 44 మంది దుర్మరణం.. 200మందికిపైగా గాయాలు..;
నిత్యం ఏదో మూల పేలుళ్లలతో దద్దరిల్లే పాకిస్థాన్(Pakistan).. మరోసారి బాంబు పేలుడుతో రక్తసిక్తమైంది. ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం(Pakistan political rally)లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44మందికిపైగా దుర్మరణం(44 people died) పాలయ్యారు. 500మందికిపైగా హాజరైన కార్యక్రమంలో జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. బహిరంగ సభలో వేదిక సమీపంలోనే ఈ దాడి జరిగింది. 200మందికిపైగా గాయపడగా(wounding nearly 200) వారిని సమీపంలోని పెషావర్, టైమర్‌గెరా ఆసుపత్రులకు తరలించారు.
అఫ్గానిస్తాన్ సరిహద్దు( borders Afghanistan)లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బజౌర్ జిల్లా(Bajaur district) ఖర్ పట్టణం(Khar)లో జమైత్ ఉలేమా ఇ ఇస్లామ్–ఫజల్(Jamiat Ulema-e-Islam) JUI-F రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి దాడి జరిగింది. బాంబు దాడిలో 44మందికిపైగా మరణించారని అధికారులు తెలిపారు. దాడిలోJUI-F కీలక నేత మౌలానా జియావుల్లా జాన్ సైతం మృతి చెందినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసులు తెలిపారు.
సభ వేదిక వద్ద పార్టీ నాయకుల రాక కోసం ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించుకోలేదు. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ దాడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆజం ఖాన్ ఖండించారు. రాష్ట్ర గవర్నర్ హాజీ గులాం అలీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.
JUI-F పార్టీ సీనియర్ పార్టీ నాయకులు కూర్చున్న వేదికకు సమీపంలోనే ఆత్మాహుతి దాడి జరిగిందని ప్రావిన్షియల్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడి వెనుక ISIS ఉగ్రవాద సంస్థ హస్తం ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది.
ఈ దాడిని పాకిస్థాన్‌లోని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దేశంలో భద్రత రోజురోజుకు క్షీణిస్తోందని మండిపడ్డాయి. ఉగ్రవాద నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.