పశ్చిమాసియా యుద్ధం అస్సలు ఆగట్లేదు. ఢీ అంటే ఢీ అంటూ మూడు దేశాలు రెచ్చిపోతున్నాయి. దీంతో ఆ దేశాలకు ఎలా ఉన్నా భారత్ కు మాత్రం గ్యాస్ సంక్షోభం తప్పట్లేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూత పడుతున్నాయి. దీంతో ఆయా రంగాల్లోని సిబ్బంది ఉద్యోగాలు పోతున్నాయి. చాలా రంగాలపై గ్యాస్ ఎఫెక్ట్ బలంగా కనిపిస్తోంది. అయితే నేడు గ్యాస్ సంక్షోభం నెలకొనగా.. రేపు పెట్రోల్ పై కూడా ఇలాంటి ఎఫెక్ట్ తప్పదా అంటూ ప్రచారం మొదలవుతోంది. ఎందుకంటే భారత్ కు రావాల్సిన 60 శాతం క్రూడ్ ఆయిల్ హర్మూజ్ జలసంధి నుంచే వస్తోంది. ప్రస్తుతం ఆ జలసంధి మూసేసింది ఇరాన్. ఇండియా నౌకలకు పర్మిషన్ ఇస్తామని చెబుతున్నా.. అక్కడ ఆయిల్ కంపెనీలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.
కాబట్టి అక్కడి నుంచి ఎగుమతులు ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్ ఎంతో కొంత ఎగుమతి చేసినా అది ఇండియాకు సరిపోదు. ప్రస్తుతం ఇండియా వద్ద ఉన్న నిల్వలతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల ముందు బండ్లు బారులు తీరుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది అన్ని రాష్ట్రాలకు వ్యాపించే ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం ఇతర మార్గాలను అణ్వేషిస్తోంది.
కానీ ప్రస్తుత యుద్ధ ప్రభావ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వేరే దేశాల నుంచి 60 శాతం క్రూడ్ ఆయిల్ రావాలంటే చాలా కష్టమే. ఇతర దేశాల్లో జనాభా తక్కువ కాబట్టి వారికి పెద్దగా ఎఫెక్ట్ పడట్లేదు. కానీ ఇండియాలో జనాభా చాలా ఎక్కువ. కాబట్టి ఇంత మందికి సరిపోయేంత పెట్రోల్, డీజిల్ కావాలంటే యుద్ధం ఆగాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు వేరే పరిస్థితులు కూడా లేవంటున్నారు. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ఓవర్ కమ్ చేస్తుందో చూడాలి.