Gaza: ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్ .. గాజాకి మానవతా సాయం
రఫా సరిహద్దు తెరవడానికి అంగీకరించిన ఈజిప్టు;
హమాస్‌పై ఇజ్రాయేల్ ప్రతీకార దాడులతో ధ్వంసమైన గాజా నగరంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక ఆకలిదప్పులతో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గాజాలో దయనీయ పరిస్థితులు యావత్తు ప్రపంచాన్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. దీంతో గాజాకి ఆపన్నహస్తం అందజేయడానికి అమెరికా ముందుకొచ్చింది. మానవతా సాయం కింద 100 మిలియన్ డాలర్లు అందజేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. బైడెన్ బుధవారం ఇజ్రాయేల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
కానీ, బాధితులకు సాయం చేసేందుకు గాజాలోకి ప్రవేశించాలంటే ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న రఫా క్రాసింగ్‌ను దాటాల్సి ఉంటుంది. అయితే, ఇజ్రాయేల్ దాడులతో ఈజిప్ట్ మూసివేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దులు తెరిపించడానికి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో అమెరికా అధ్యక్షుడు జరిపిన చర్చలు ఫలించాయి. రఫా బార్డర్ క్రాసింగ్ తెరిచేందుకు ఆయన అంగీకరించారు. దీంతో గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైంది. దీనిపై జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ రఫా సరిహద్దు తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన దాదాపు 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఈజిప్టు అధ్యక్షుడు అంగీకరించారు అని తెలిపారు.
రఫా క్రాసింగ్ అంటే ఏమిటి
ఇది గాజా స్ట్రిప్‌కు దక్షిణాన ఉన్న బార్డర్ క్రాసింగ్. ఇది గాజా స్ట్రిప్, ఈజిప్ట్‌లోని సినాయ్ ఎడారి ప్రాంతాన్ని కలుపుతుంది. గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఎరేజ్, కెరెమ్ షాలోమ్ అనే ఇతర సరిహద్దు పాయింట్లు కూడా ఉన్నాయి. అయితే.. అవి ఇజ్రాయెల్‌తో అనుసంధానించబడి, ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్నాయి. తన వాణిజ్య కార్యకలాపాల కోసం మాత్రమే ఇజ్రాయెల్ ఆ రెండింటిని తెరుస్తుంది. ఇప్పుడు హమాస్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అక్టోబర్ 7వ తేదీ నుంచి ఈ రెండు బార్డర్లను ఇజ్రాయెల్ పూర్తిగా మూసేసింది. ప్రస్తుతానికి గాజా పౌరులకు జీవనాధారంగా మారిన ఈ రఫా బార్డర్ క్రాసింగ్‌ను ప్రస్తుతానికి మూసివేశారు. హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఇజ్రాయెల్ కోరుతోంది. మరోవైపు.. ఈ రఫా బార్డర్‌పై నియంత్రణ కలిగిన ఈజిప్ట్ సైతం దీన్ని తెరిచేందుకు ఇష్టపడట్లేదు. పాలస్తీనా పౌరులు గాజా స్ట్రిప్ నుంచి సినాయ్ ఎడారిలో వచ్చి స్థిరపడతారేమోనని ఈజిప్ట్ చింతిస్తోంది. ఇదే సమయంలో.. ఇస్లామిక్ తీవ్రవాదులు కూడా తమ దేశంలోకి వస్తారని ఈజిప్ట్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.