Elon Musk: వెనిజులాకు నెల రోజుల ఉచిత ఇంటర్నెట్..

ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

Update: 2026-01-04 07:45 GMT

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వెనిజులా ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ కీలక ప్రకటన చేశారు. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, ప్రజలకు నిరంతరాయంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించేందుకు నెల రోజుల పాటు స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌' లో వెల్లడించారు.

అమెరికా సైనిక చర్యలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన కొద్దిసేపటికే మస్క్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. మదురో అరెస్ట్‌ను స్వాగతించిన మస్క్, ఆయన పాలన ముగియడంతో ఇకనైనా వెనిజులా అభివృద్ధి పథంలో పయనించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. "వెనిజులా ఇప్పుడు శ్రేయస్సును పొందగలదు" అని స్పానిష్ భాషలో వ్యాఖ్యానించారు. లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా పనిచేసే స్టార్‌లింక్ నెట్‌వర్క్, దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో కనెక్టివిటీ సమస్యలు లేకుండా చూస్తుంది. ఫిబ్రవరి 3 వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి.

మదురో ప్రభుత్వంపై మస్క్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందన ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. మదురో ప్రభుత్వ విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆయన చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో ప్రతిపక్షానికి బహిరంగంగా మద్దతు పలికిన మస్క్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోకు అండగా నిలిచారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న వెనిజులా, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే అభివృద్ధికి దూరమైందని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News