Elon Musk: టిక్‌టాక్ కొనుగోలు ఆలోచనే లేదు..
స్పష్టం చేసిన ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్;
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ పై అమెరికాలో నిషేధం ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. దీని నుంచి తప్పించుకునేందుకు అమెరికాలోని టిక్‌టాక్ కార్యకలాపాలను ప్రపంచకుబేరుడు ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ కు విక్రయించాలని యోచిస్తునట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మస్క్ దీనిపై స్పందించారు. దాన్ని కొనుగోలు చేసే యోచనలో తాను లేనని స్పష్టం చేశారు. గత నెలలో ఓ వీడియోలో ఆయన ఈవిషయాన్ని వెల్లడించగా.. జర్మనీకి చెందిన ఓ వార్తా సంస్థ తాజాగా బయటపెట్టింది.
‘నేను టిక్‌టాక్ కోసం బిడ్డింగ్ వేయలేదు. దాన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి లేదు. ఒకవేళ కొన్నా ఏం చేయాలనేదానిపై ఎలాంటి ప్రణాళికలు లేవు. నాకు కంపెనీలు కొనడం కంటే.. నెలకొల్పడం అంటేనే ఇష్టం’ అని మస్క్ పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ను భారత్ సహా పలు దేశాలు నిషేధించాయి. అమెరికా (USA)లోని కొన్ని రాష్ట్రాలూ దీని వినియోగంపై ఆంక్షలు పెట్టాయి. ఈనేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదలుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందే అనేది బిల్లులోని సారాంశం. అనంతరం అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు డెడ్‌లైన్ ఇచ్చింది. ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన అనంతరం 75 రోజుల్లోగా టిక్‌టాక్‌ను (TikTok US) అమ్మేయాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పైన సంతకం చేశారు. అనంతరం సంస్థ జాయింట్ వెంచర్‌లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే దానికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన సన్నిహితుడైన మస్క్‌కు దీన్ని విక్రయించాలని సంస్థ యాజమాన్యం యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
మరోవైపు.. ‘సావరిన్ వెల్త్‌ఫండ్’ ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ట్రంప్ ఇటీవల ఆదేశించారు. ఈమేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. కొత్తగా సృష్టించిన సావరిన్ వెల్త్‌ఫండ్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.