Cage Fight: కుభేరుల కొట్లాట ప్రత్యక్ష ప్రసారం
జుకర్‌బర్గ్‌తో కేజ్ ఫైట్ జరగనుందన్న ప్రచారాన్ని ధ్రువీకరించిన మస్క్... ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తానని ప్రకటన;
ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్(Elon Musk).. ఫేస్‌బుక్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్( Mark Zuckerberg) మధ్య కేజ్ ఫైట్(cage fight )పై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న వేళ మస్క్ కీలక ప్రకటన చేశారు. జుకర్‌బర్గ్‌కు తనకు మధ్య కేజ్ ఫైట్ జరగనుందని ప్రచారాన్ని ధ్రువీకరించారు. జుకర్‌బర్గ్‌తో తాను చేసే పోరాటాన్ని ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం(Live-Streamed On X) చేస్తానని ట్వీట్ చేశారు. ఈ ఫైట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తామని ప్రకటించారు. మస్క్ ట్వీట్‌తో సామాజిక మాధ్యమాల్లో వీరి గురించే చర్చ సాగుతోంది.
ఈ దిగ్గజ సీఈవోలు కొంతకాలంగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా రాజకీయాలు, కృత్రిమ మేథకు సంబంధించిన విషయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇవి గత నెలలో తారాస్థాయికి చేరాయి. ఎక్స్‌కు పోటీగా జుకర్‌బర్గ్ థ్రెడ్స్‌ను తీసుకొచ్చారు. దీనిపై ఎలాన్ మస్క్ విమర్శలు చేశారు. ఎక్స్‌ను కాపీ కొట్టి థ్రెడ్స్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. పరస్పర విమర్శలు చేసుకునే క్రమంలోనే జుకర్‌బర్గ్ ఒప్పుకుంటే కేజ్ ఫైట్‌కు తాను సిద్ధమని తొలుత మస్క్ ట్వీట్ చేశారు. జుకర్‌బర్గ్ కూడా మస్క్‌కు అదే రీతిలో సమాధాన మిచ్చారు. ఎక్కడో చెప్పు అంటూ సవాల్ విసిరారు. వెగాస్ ఆక్టాగాన్..రా చూసుకుందాం అంటూ మస్క్ సమాధానమిచ్చారు. దీంతో వీరిద్దరూ కేజ్ ఫైట్‌లో తలపడబోతున్నారని ప్రచారం మొదలైంది.
తొలుత ఇది కేవలం ప్రచారం కోసం జరుగుతుందని నెటిజన్లు భావించారు. కానీ, కొద్ది రోజులుగా ఇరువురు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనడం.. శరీరాకృతిని ప్రదరిస్తూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుండటంతో వీరి మధ్య పోరు ఖాయమని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా మస్క్ కూడా ట్వీట్ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. జుకర్‌బర్గ్‌తో తాను చేసే పోరాటాన్ని ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తానని మస్క్ ట్వీట్ చేశారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థల(charity for veterans )కు అందిస్తామని పేర్కొన్నారు.
అయితే జుకరబర్గ్‌తో కేజ్ ఫైట్ ఎప్పుడు జరుగనుందో మాత్రం మస్క్ తెలపలేదు. వీరిద్దరి మధ్య పోరాటం జరిగితే వయసులో చిన్నవాడైన జుకర్‌బర్గే గెలుస్తారనే విశ్లేషణలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. కొందరు అభిమానులు మాత్రం మస్క్‌కే ఓటు వేస్తున్నారు.