Musk: మస్క్‌ రోజూ ఒకే సూట్‌ ధరించేవాడు: మాయే మస్క్‌

ఎలాన్‌ మస్క్‌ చిన్నతనంలో తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పిన తల్లి;

Update: 2024-12-13 05:45 GMT

 ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంపద విలువ 400 బిలియన్‌ డాలర్ల పైమాటే. తొలిసారిగా 400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరి, ప్రపంచ చరిత్రలో ఈ స్థాయి సంపద ఆర్జించిన తొలి వ్యక్తిగా తాజాగా మస్క్‌ రికార్డ్‌ సృష్టించారు. ఈ నేపథ్యంలో మస్క్‌ తల్లి మాయే మస్క్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇంత సంపదను ఆర్జించిన తన కుమారుడు కొన్నేళ్ల క్రితం ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడని ఆమె గుర్తు చేసుకున్నారు.

1990లో తాము ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గురించి వెల్లడిస్తూ.. అప్పట్లో మస్క్‌ బ్యాంక్‌లో ఉద్యోగం చేసేవాడని తెలిపారు. ఉద్యోగానికి వెళ్లడానికి సరైన దుస్తులు లేక 99 డాలర్లతో కొన్న ఒకేఒక్క సూట్‌ను ప్రతిరోజూ ధరించేవాడని పేర్కొన్నారు. ఆ సూట్‌లో మస్క్‌ తీసుకున్న ఓ ఫొటోను సైతం పంచుకున్నారు. తాము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మస్క్‌ ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో తన తల్లి ఈ ఫొటోను తీశారని మాయే రాసుకొచ్చారు.

ఆమె రాసిన ‘‘ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’’ అనే పుస్తకంలోనూ తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు. తన పిల్ల్లల చిన్నతనంలో వారికి దుస్తులు కొనడానికి కూడా తమ వద్ద డబ్బు ఉండేది కాదని.. దీంతో సెంకండ్‌ హ్యాండ్‌ దుస్తులను కొనుగోలు చేసేవారమని తెలిపారు. తినడానికి ఆహారం లేకపోతే బ్రెడ్‌, పీనట్‌ బటర్‌ పెట్టేదాన్నని..దాన్నే వారు ఇష్టంగా తినేవారని అన్నారు. కానీ వారు ఏమి కోల్పోయారనేది తన పిల్లలకు తెలియదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమారుడు ఎలాన్‌ మస్క్‌ను అత్యంత సంపన్నుడు, బిలియనీర్‌ అని కాకుండా ఓ మేధావి అని పిలిస్తే గర్వంగా ఫీల్‌ అవుతానని చెప్పుకొచ్చారు.

దక్షిణాఫ్రికాకు చెందిన మస్క్‌ తండ్రి ఎరోల్ మస్క్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం మాయే మస్క్‌ ఎన్నో సమస్యలను ఒంటరిగా ఎదుర్కొంటూ తన ముగ్గురు పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దారు. మస్క్‌ కుటుంబం మొదట దక్షిణాఫ్రికా నుంచి కెనడాకు వలస వెళ్లి.. చివరికి అమెరికాలో స్థిరపడింది.  

Tags:    

Similar News