Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ‘ఫుంగ్‌-వాంగ్‌’ తుఫాను .. దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటన‌

.. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షలమంది

Update: 2025-11-10 04:09 GMT

ద్వీప దేశం ఫిలిప్పీన్స్‌ను‘ఫుంగ్‌-వాంగ్‌’  తుపాను అతలాకుతలం చేస్తోంది. ఇటీవలే ‘కల్మేగి’ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే, ‘ఫుంగ్-వాంగ్’ (ఉవాన్) అనే సూపర్ టైఫూన్ దేశంపై విరుచుకుపడింది. సోమవారం ఉదయం అరోరా ప్రావిన్స్‌లోని దినాలుంగన్ పట్టణం వద్ద ఇది తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో గాలులు వీచాయని, వాటి తీవ్రత గరిష్ఠంగా గంటకు 230 కిలోమీటర్ల వరకు చేరిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇటీవలి కాలంలో ఫిలిప్పీన్స్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన తుపాను ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఫుంగ్-వాంగ్ దాదాపు 1800 కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండటంతో దేశంలోని మూడింట రెండొంతుల భూభాగాన్ని ప్రభావితం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, అక్టోబర్ 7న సంభవించిన ‘కల్మేగి’ తుపాను కారణంగా ఇప్పటికే 224 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో భారీ విపత్తు ముంచుకురావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఫుంగ్-వాంగ్ ప్రభావంతో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కాటాండూన్స్ ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఒకరు మరణించగా, సమర్ ప్రావిన్స్‌లో ఓ మహిళపై శిథిలాలు పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

 ఎమర్జెన్సీ ప్రకటన‌

ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. గంటకు 185 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే తుపానులను ఇక్కడ ‘సూపర్ టైఫూన్’గా వర్గీకరిస్తారు. పరిస్థితి తీవ్రతను తెలియజేయడానికే ఈ పదాన్ని ఉపయోగిస్తారు. "వర్షం, గాలుల తీవ్రతకు దాదాపు ఏమీ కనిపించని పరిస్థితి (జీరో విజిబిలిటీ) నెలకొంది" అని కాటాండూన్స్ విపత్తు నిర్వహణ అధికారి రాబర్టో మాంటెరోలా ఏపీ వార్తా సంస్థకు తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న 14 మందిని తమ సిబ్బంది రక్షించారని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో ఈశాన్య ప్రావిన్స్‌లలోని ప్రమాదకర ప్రాంతాల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 3 కోట్ల మంది ప్రజలపై ఈ తుపాను ప్రభావం పడవచ్చని అంచనా వేస్తున్నారు. రక్షణ మంత్రి గిల్బర్టో టియోడోరో జూనియర్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రభుత్వ ఆదేశాలు పాటించి వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను విడిచి వెళ్లాలని సూచించారు.

ముందుజాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల్లోని పలు నగరాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సోమ, మంగళవారాల్లో సెలవులు ప్రకటించారు. వారాంతం నుంచి ఇప్పటివరకు 325 దేశీయ, 61 అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఓడరేవుల్లో రాకపోకలను నిలిపివేయగా, 6,600 మంది ప్రయాణికులు, కార్గో సిబ్బంది చిక్కుకుపోయారు.

Tags:    

Similar News