తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మెర్ లను భూమి మీదకు తీసుకురావడానికి ఫాల్కన్-9 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నాసా-స్పేస్ ఎక్స్ చేపట్టిన 'క్రూ-10' మిషన్లో భాగంగా భారత కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజామున 4.33కు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అందులో నలుగురు వ్యోమగాములు సైతం అంతరిక్షంలోకి వెళ్లారు. డ్రాగన్ క్యాప్సూల్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లిన వ్యోమగాముల్లో నికోల్ అయర్స్, కిరిల్ పెస్కోవ్, అన్నె మెక్లెయిన్, టకుయా ఒనిషి ఉన్నారు. స్పేస్ షిప్ ఐఎస్ఎస్ తో నేడు అనుసంధానం కానుంది. ఆ నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ బాధ్యతలు తీసుకున్న వెంటనే సునీత, బచ్ విల్మెర్ ఈ నెల 19న భూమి మీద అడుగు పెట్టే అవకాశం ఉంది.