U.S. Polling : రేపే అమెరికాలో పోలింగ్.. చివరి దశ ప్రచారంలో ట్రంప్, కమల

Update: 2024-11-04 09:15 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రేపు పోలింగ్‌ జరుగనుంది. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాగా పోలింగ్‌ తేదీ కంటే ముందుగానే ఓటేసే అవకాశాన్ని కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకూ 6.8 కోట్ల మంది ఓటేసినట్టేనని తెలుస్తోంది. మరోవైపు ప్రెసిడెంట్‌ రేసులో వున్న డొనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌ ల ప్రచారం తుదిదశకు చేరుకుంది. వారు స్వింగ్‌ స్టేట్స్‌ పై దృష్టి పెట్టి మరీ తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

అమెరికాలో మొత్తం 24 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ముందస్తు ఓటింగ్‌కు ఓటర్లు వెల్లువెత్తుతుండటంతో గతంలో కంటే ఈసారి పోలింగ్‌ కేంద్రాలను పెంచారు. ముందస్తు ఓటింగ్‌లో న్యూయార్క్‌ రికార్డు సృష్టించింది. అమెరికా అంతటా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇప్పటికే 6.8 కోట్ల మంది అమెరికన్లు ఓటేశారు. మెయిళ్లద్వారా, పోలింగ్‌ కేంద్రాల ద్వారా వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో న్యూయార్క్‌లో 100 ముందస్తు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈసారి 50శాతం అధికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

అభ్యర్థుల ప్రచారం ముగింపు దశలో ఉంది. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌.. తనకు అనుకూలమైన నార్త్‌ కరోలినాలో మకాం వేయగా.. డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ కూడా అదే పనిలో బిజీగా వున్నారు. ఇక పోలింగ్‌ రోజు అంటే మంగళవారం వరకూ నార్త్‌ కరోలినాలో ఉండి ర్యాలీలు నిర్వహించాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. కమలా హారిస్‌ కూడా నార్త్‌ కరోలినాలోని ఛార్లెట్‌లో ప్రచారం చేశారు. తుపాను కారణంగా నార్త్‌ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు మొగ్గుతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. 

Tags:    

Similar News