ఇస్తాంబుల్ నైట్‌క్లబ్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో 29 మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు. క్లబ్ పునరుద్ధరణ పనుల సందర్భంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి క్లబ్ మేనేజర్లతో సహా మొత్తంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాయపడిన ఒక వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఈ మేరకు ఇస్తాంబుల్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. 16 అంతస్తుల నివాస భవనంలో నైట్ క్లబ్ గ్రౌండ్, బేస్‌మెంట్ ఫ్లోర్‌లలో వుంది. మరమ్మత్తులు జరుగుతున్న కారణంగా దీన్ని మూసివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు గవర్నర్ దావుత్ గుల్ విలేకర్లకు తెలిపారు. బహుశా పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గన్నవారే బాధితులై వుంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భవనం భద్రతను అంచనా వేసేందుకు అధికారులు మొత్తంగా తనిఖీలు చేస్తున్నారని మేయర్ తెలిపారు. సమాచారం తెలియగానే అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చాయి.