Oil Reserve : యుద్ధం వచ్చినా నో టెన్షన్.. భారత్ దగ్గర 50 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్.
Oil Reserve : పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో భారత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలకు స్వస్తి పలకాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారతదేశం వద్ద సుమారు 50 రోజులకు సరిపడా ముడి చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని, కాబట్టి సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, సామాన్యులపై ఎటువంటి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది.
సాధారణంగా గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం వస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే సముద్ర మార్గం మూతబడుతుందనే భయం ఉంటుంది. అయితే, భారత్ తన ముడి చమురు అవసరాల్లో కేవలం 40 శాతం మాత్రమే ఈ మార్గం ద్వారా పొందుతోందని ప్రభుత్వం వివరించింది. మిగిలిన 60 శాతం సరఫరా ఇతర దేశాలు మరియు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జరుగుతోంది. కాబట్టి హార్ముజ్ జలసంధి వద్ద సమస్యలు తలెత్తినా భారత్‌కు పెద్దగా నష్టం ఉండదు. అయితే, ఎల్ఎన్జీ గ్యాస్ సరఫరాలో కొంత తగ్గుదల ఉండే అవకాశం ఉందని, అటువంటి సమయంలో పారిశ్రామిక అవసరాల కంటే గృహావసరాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్యాస్ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
యుద్ధం కారణంగా చమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. కతార్, ఒమన్ వంటి దేశాల అగ్రనేతలతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిరోజూ రెండుసార్లు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. రష్యాతో పాటు ప్రపంచంలోని పెద్ద చమురు సరఫరా కంపెనీలతో భారత్ టచ్‌లో ఉంది. కతార్ ఎనర్జీ సంస్థ ఫోర్స్ మెజూర్(అనివార్య కారణాల వల్ల సరఫరా నిలిపివేత) ప్రకటించినప్పటికీ, భారత్ వద్ద ఉన్న నిల్వలు ప్రస్తుత అవసరాలను తీర్చగలవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చమురు ధర బ్యారెల్‌కు 84-85 డాలర్ల వద్ద ఉండవచ్చని, ఉద్రిక్తతలు తగ్గితే మళ్ళీ 74 డాలర్లకు దిగివస్తుందని అంచనా వేస్తున్నారు. చమురు ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. అలాగే, దేశంలో ఎరువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని, రైతులకు అవసరమైన సాగు ఉత్పాదకాలు సకాలంలో అందుతాయని కేంద్రం భరోసా ఇచ్చింది.