WONDER: పుట్టగానే విడిపోయి 19 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు
జార్జియాలో అద్భుత, అనూహ్య ఘటన.... ఆశ్చర్యపోయిన ప్రపంచం
బాలీవుడ్‌లో 1972నాటి బ్లాక్‌బస్టర్ సీతా ఔర్ గీతా.. తెలుగులో వచ్చిన హలోబ్రదర్ చిత్రాలను తలపించే వాస్తవ ఘటన జార్జియాలో జరిగింది. పుట్టగానే ఆస్పత్రి బెడ్‌పై నుంచి విడిపోయిన ఇద్దరు కవలలు.. తిరిగి 19 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. పుట్టగానే విడిపోయిన ఇద్దరు కవలలు.. 19 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న ఘటన జార్జియాలో జరిగింది. అమీ క్విట్టియా, అనో సార్టానియా అనే ఇద్దరు కవలలు విధి ఆడిన వింతనాటకంలో ఎలా ఒక్కటయ్యారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అజాషోని అనే మహిళ 2002లో ఓ ఆస్పత్రిలో ఒకే సమయంలో ఇద్దరు ఆడబిడ్డలను ప్రసవించింది.
ప్రసవం అసాధారణంగా జరగడంతో తల్లి కోమాలోకి వెళ్లింది. ఇదే మంచి సమయం అనుకున్న ఆ కవలల తండ్రి గోచాగఖారియా.. ఆ బిడ్డలను 2 వేర్వేరు కుటుంబాలకు విక్రయించాడు. అనో.. టిబిలిసిలో పెరగ్గా.. అమీ ఆ ప్రాంతానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని జుగ్దిడిలో పెద్దదైంది. 11 ఏళ్ల వయసులో వీరిద్దరు కలిసి జార్జియాలోని ఓ నృత్య పోటీలో పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరిని చూసిన ప్రేక్షకులు.. ఒకేలా ఉన్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అప్పటికీ వీరిద్దరిది పేగుబంధమని బయటపడలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత అమీ.. ఈ విషయాన్ని తల్లికి చెప్పినా ఆమె వినలేదు. మనుషుల్నిపోలిన మనుషులు ఉంటారంటూ సమాధానం దాటవేశారు. వారిద్దరికి నిజం తెలుసుకునేందుకు మరో ఏడేళ్లు పట్టింది.
2021లో అమీ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్టు చేయగా.. అనో ఆ వీడియోను చూసింది. అమీ అచ్చం తనలాగే ఉందంటూ అనో ఆశ్చర్యపోయింది. తర్వాత పలు విధాలుగా ప్రయత్నించిన అనో.. నెటిజన్ల సాయంతో అమీని పట్టుకుంది. ఇంట్లో ఆరా తీయగా.. తమను రెండు కుటుంబాలు అక్రమంగా దత్తత తీసుకున్నట్లు తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయాలేంటంటే.. ఇద్దరికీ సంగీతమన్నా,. డ్యాన్స్ అన్నా విపరీతమైన ఇష్టం. కలవక ముందు నుంచి కూడా ఇద్దరూ ఒకేరకమైన హెయిర్ స్టైల్‌తో ఉండేవారు. ఇద్దరూ డిస్ప్లేషియా అనే ఎముకలకు సంబంధించిన జన్యుసంబంధమైన వ్యాధితో బాధ పడుతున్నారు. ఇద్దరిదీ ఒకే రకమైన గొంతు. అనోకి ఎవరినీ హత్తుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ అమీని చూడగానే గట్టిగా హత్తుకుంది.