Green Card: త్వరలో H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ వ్యవస్థలో మార్పులు..
వేలాది మంది భారతీయులపై కొత్త రూల్ ప్రభావం!;
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వేలాది భారతీయ కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. హెచ్-1బీ వీసాపై పనిచేస్తూ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పిల్లల విషయంలో అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఆమోదం పొందే సమయానికి పిల్లల వయసు 21 ఏళ్లు దాటితే, వారిని అనర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ కొత్త, కఠినమైన నిబంధన ఆగస్టు 15 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.
గతంలో జో బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు పిల్లల వయసు ఎంత ఉందో, ఆమోదం సమయంలో కూడా దాన్నే పరిగణనలోకి తీసుకునేవారు. దీనివల్ల దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యమైనా పిల్లల భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే, ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. గ్రీన్ కార్డ్ తుది ఆమోదం పొందే నాటికి పిల్లల వయసును ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని తేల్చి చెప్పింది.
ఈ నిర్ణయంతో 21 ఏళ్ల వయసు దాటిన పిల్లలు తమ తల్లిదండ్రుల దరఖాస్తు కింద గ్రీన్ కార్డ్ పొందే అవకాశాన్ని కోల్పోతారు. అలాంటి వారు అమెరికాలో ఉండాలంటే ప్రత్యేకంగా మరో వీసాకు దరఖాస్తు చేసుకోవాలి లేదా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
అమెరికాలో గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడానికి చాలా ఏళ్ల సమయం పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతీయుల దరఖాస్తులు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌సీఐఎస్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దరఖాస్తు చేసినప్పుడు చిన్న వయసులో ఉన్న ఎంతో మంది పిల్లలు, ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో 21 ఏళ్ల వయసు దాటిపోయి గ్రీన్ కార్డ్‌కు అనర్హులుగా మారే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిణామం అమెరికాలోని భారతీయ టెక్కీలు, వృత్తి నిపుణుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.