Israel: టెల్ అవీవ్‌పై విరుచుకుపడిన హమాస్, భారీ స్థాయిలో రాకెట్లు
నగరంలో అత్యవసర అలారం మోగించిన ఇజ్రాయెల్ సైన్యం;
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా ఆదేశ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురుపించింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానికి దాడుల్లో దాదాపు 22 మంది పాలస్తీనియన్లు మరణించారు. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుస బాంబు దాడులు జరిగాయని గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు తెలిపింది. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అటు ఈ దాడిని ఇజ్రాయెల్ ఖండించింది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తమకు తెలియదని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అంతకుముందు టెలీ అవీవ్‌పై హమాస్ దీర్ఘ శ్రేణి రాకెట్లతో విరుచుకుపడింది. తమ పౌరులపై జరుగుతోన్న మారణకాండకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు జరిపినట్లు హమాస్ పేర్కొంది.
గాజాలో ఇటీవల దూకుడు పెంచిన హమాస్.. ఆదివారం ఏకంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. భారీగా పొగలు వస్తున్న దృశ్యాలూ కనిపించాయి. టెల్ అవీవ్‌లో సైరన్లు మోగడం ఐదు నెలల కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా టెల్ అవీవ్ దిశగా జనవరిలో హమాస్ రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడికి సంబంధించి నష్టం వివరాలు ఇంకా తెలియలేదు. టెల్ అవీవ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలపైనా హమాస్ రాకెట్ల దాడి చేసిందని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ గాజాలోని రఫా నుంచే ఈ రాకెట్లను హమాస్ ప్రయోగించి ఉంటుందని ఐడీఎఫ్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడినా, సుదీర్ఘ శ్రేణి రాకెట్లను ప్రయోగించే సత్తా ఇంకా తమకు ఉందని ఈ దాడితో హమాస్ నిరూపించింది. ఇటీవల కాలంలో హమాస్‌కు చెందిన అల్ కసమ్ బ్రిగేడ్స్ దూకుడు పెంచింది. ఈ రాకెట్ల దాడిని తామే చేశామని టెలిగ్రామ్ ఛానల్‌లో ఆ బ్రిగేడ్ ప్రకటించింది. రఫాపై ఇజ్రాయెల్ దృష్టి కేంద్రీకరించిన వేళ.. ఉత్తర గాజాలో జబాలియాలో ఇటీవల హమాస్ క్రియాశీలమైంది. గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తోంది. జబాలియాలో ఓ ఇజ్రాయెలీ సైనికుడిని తాము అపహరించామని ఆదివారం హమాస్ ప్రకటించింది. టెల్ అవీవ్ మాత్రం ఈ వార్తను ఖండించింది. మరోవైపు ఈజిప్టు నుంచి ఐక్యరాజ్యసమితి మానవతా సాయం ఆదివారం గాజాలోకి ప్రవేశించింది. కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా 200 ట్రక్కులు గాజాలోకి వెళ్లాయని ఈజిప్టు రెడ్ క్రెసెంట్ సంస్థ తెలిపింది. ఈ నెల ఆరో తేదీన రఫా క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించడంతో గాజాకు మానవతా సాయం ఆగిన సంగతి తెలిసిందే.