israel hamas: గాజాపట్టీలో వెతికేకొద్ది హమాస్ మిలిటెంట్ల సొరంగాలు
దక్షిణ గాజాలో భారీ సొరంగం;
గాజాపట్టీలో వెతికేకొద్ది హమాస్ మిలిటెంట్ల సొరంగాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉత్తరగాజాలో హమాస్ సొరంగాల నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం దక్షిణగాజాలో మరో భారీ సొరంగాన్ని కనుగొంది. వాటిలో హమాస్ మిలిటెంట్లు బందీలను దాచి పెట్టినట్లు ఆధారాలు లభించాయని తెలిపింది.
ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్ల సొరంగ నెట్‌వర్క్ సహా మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం దక్షిణగాజాలో కూడా భారీ టన్నెల్ నెట్‌వర్క్‌ను కనుగొంది. దక్షిణగాజాలో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌లో ఈ సొరంగ నెట్‌వర్క్ వెలుగు చూసింది. నగరంలో సామాన్య పౌరులు నివసిస్తున్న ప్రాంతాల కిందే ఇది ఉండటం గమనార్హం. ఈ భూగర్భ టన్నెల్‌లో బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ పౌరులను హమాస్ ఉంచినట్లు ఆధారాలను గుర్తించారు. అంతర్జాతీయ మీడియాకు ఈ టన్నెల్‌ను ఇజ్రాయెల్ చూపించింది.
ఈ సొరంగంలో టాయిలెట్లు వంటి సౌకర్యాలను హమాస్ మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరగాజాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం ప్రస్తుతం దక్షిణ గాజాలోని అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌పై దృష్టిపెట్టింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మృతి చెందిన గాజా పౌరుల సంఖ్య 23 వేలు దాటింది. మృతుల్లో మూడింట రెండో వంతు మహిళలు, చిన్నారులేనని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతోంది.
హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియే ఖతార్‌లో ఏర్పాటైన ముస్లిం మేధావుల సదస్సులో మాట్లాడుతూ, “గాజాలో చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఏ లక్ష్యాలనూ సాధించలేకపోయింది. పూర్తిగా విఫలమైంది” అని అన్నారు. “పాలస్తీనా సమస్యను అణచివేసేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగానే అక్టోబర్ 7 దాడులు జరిగాయి” అని హానియే చెప్పారు. గాజాలో బందీలుగా ఉన్న వారి గురించి మాట్లాడుతూ, “మా ఖైదీలు అందరినీ విడుదల చేస్తే కానీ, ఇజ్రాయెల్ తమ బందీలను విడుదల చేయించుకోవడం సాధ్యం కాదు” అని అన్నారు. ఆ తరువాత హమాస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో హానియే ముస్లిం దేశాలకు విజ్ఞప్తి చేశారు. “మా ప్రతిఘటనకు ఆయుధాలు ఇచ్చి సహకరించండి. ఎందుకంటే, ఇది పాలస్తీనా ప్రజల పోరాటం మాత్రమే కాదు” అని ఆన్నారు.