Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు
పత్రికా కార్యాలయాలు, షేక్ ముజిబుర్ నివాసం ధ్వంసం
బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణంతో ఆందోళనకారులు మళ్లీ వీధుల్లోకి వచ్చారు. గురువారం రాత్రి నుంచి భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
‘‘ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించండి’’ అని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో వెల్లడించారు.
మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ స్పందించింది. పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతోందని, బంగ్లాలో మైనార్టీలపై దాడుల గురించి తెలిసి విదేశాంగ శాఖ ఆందోళనతో ఉందని పేర్కొంది. ఆ దేశంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలపైనా అనిశ్చితి నెలకొందని తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. బంగ్లాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదికి న్యాయం చేయాలంటూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. నిన్న రాత్రి రాజ్‌షాహీలోని అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. చిట్టగాంగ్ మాజీ మేయర్ మొహియుద్దీన్ నివాసానికి నిప్పు పెట్టారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయానట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. పలు మీడియా కార్యాలయాలకు నిప్పు పెట్టగా.. అక్కడి విలేకరులను ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
హదీ మరణం తర్వాత రాత్రికి రాత్రే ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. 'ప్రథమ్ ఆలో', 'ది డైలీ స్టార్' వంటి ప్రముఖ పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అలాగే, ధన్‌మండిలోని షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం, ఛాయానాట్ సాంస్కృతిక భవన్‌పై కూడా దాడులు జరిగాయి. చిట్టగాంగ్‌తో పాటు రాజ్‌షాహీ, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి దాడులు జరిగినట్లు సమాచారం.