Narendra Modi: మోదీకి ట్రంప్ ఫోన్..యూఎస్ రాయబారి ఆసక్తికర పోస్ట్..

యూఎస్ రాయబారి ఆసక్తికర పోస్ట్..

Update: 2026-02-02 23:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య సోమవారం ఫోన్ సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. "అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు. స్టే ట్యూన్డ్..." అని ఆయన పోస్ట్ చేయడంతో ఈ సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత్, అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం వరకు భారీ సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కొంతకాలంగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఏం చర్చ జరిగి ఉంటుందనే దానిపై ఉత్కంఠ పెరిగింది.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మూడు రోజుల పర్యటన కోసం వాషింగ్టన్ వెళ్లిన రోజే ఈ సంభాషణ జరగడం గమనార్హం. ఈ పరిణామం రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య బంధాలను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తోంది.

అయితే, ఇద్దరు నేతల మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంభాషణపై భారత ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 'స్టే ట్యూన్డ్' అని రాయబారి సూచించిన నేపథ్యంలో, వాణిజ్య ఒప్పందం లేదా ఇతర కీలక అంశాలపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో అనిశ్చితి ఏర్పడింది. కేంద్ర బడ్జెట్ 2026లో కూడా ఈ టారిఫ్‌లను ఎదుర్కొనే చర్యల్ని పొందుపరిచారు. భారత్ తన ఉత్పత్తుల కోసం ఇతర మార్కెట్లను చూసుకుంటోంది. ఇటీవల యురోపియన్ యూనియన్-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరింది. చివరిసారిగా డిసెంబర్ 2025లో ఇరువురు నేతలు మాట్లాడారు.

తాజాగా ప్రధాని మోడీ కూడా ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈ చర్చ సానుకూలంగా సాగిందని అభివర్ణించారు. మరోవైపు రాయబారి ‘‘స్టే ట్యూన్డ్’’ అని వ్యాఖ్యలో రెండు దేశాల మధ్య కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా రాయబారి పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రధాని మోడీ ఫోటో ఉన్న పోస్టును షేర్ చేశారు. ఈ పోస్టులో ఎలాంటి వ్యాఖ్యలు లేకపోయినా, ఇండియా టుడే మ్యాగజైన్ ‘‘న్యూస్‌మేకర్స్ ఆఫ్ ఆ ఇయర్ 2025’’ కవర్ పేజీని షేర్ చేశారు. ఈ కవర్ పేజీపై మోడీ, ట్రంప్ ఫోటోలు ఉన్నాయి.

Tags:    

Similar News