Himalayan Glaciers: ముంచుకొస్తున్న ముప్పు

వేగంగా కరిగిపోతున్న హిమానీనదాలు.... వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే పెను విధ్వంసం తప్పదన్న శాస్త్రవేత్తలు;

Update: 2023-08-18 04:15 GMT

దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలకు కీలకమైన నీటిని అందిస్తున్న హిమాలయ హిమనీనదాలు అత్యంత వేగంగా కరుగుతున్నాయని మరోసారి శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ పరిణామం రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడి ఉన్న దేశాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ గ్లేసియర్స్ అనూహ్యంగా కరిగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. హిమానీనదాలు గత దశాబ్దంతో పోలిస్తే 65 శాతం వేగంగా అదృశ్యమయ్యాయని శాస్త్రవేత్తలు చెప్పారు.(Himalayan Glaciers Melting) హిమాలయాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించారు.

వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే 2100 నాటికి ఫిన్‌లాండ్ పరిమాణమంత హిమనీనదాలు కరిగిపోతాయని(Himalayan glaciers lose 2100) శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం మంచుఫలకాలు భూఉపరితల విస్తీర్ణంలో 10 శాతంగా ఉన్నాయన్నారు. స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలు తాజాగా నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వాతావరణ మార్పుల కట్టడికి మరిన్నీ పకడ్బందీ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు.


పారిస్‌ వాతావరణ ఒప్పంద లక్ష్యాలను చేరుకున్నా నేపాల్‌ పరిమాణమంతా హిమనీనదాలు కరిగిపోతాయని తెలిపారు. గ్రీన్‌లాండ్‌, అంటార్కిటిక్‌ మంచు ఫలకాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 10 వేల హిమానీనదాలు ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. 2020 నాటికి ఇవి 6 లక్షల 65 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని వెల్లడించింది. 2100 నాటికి లక్షా 49 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 3 లక్షల 39 వేల చదరపు కిలోమీటర్ల మేర మంచుఫలకాలు కరిగిపోతాయని శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ఇవి నేపాల్, ఫిన్‌లాండ్ దేశాల పరిమాణాలకు సమానమని వెల్లడించారు.

హిమానీనదాల కింద స్థలాకృతిని పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో వాటి స్థానంలో ఏమి ఏర్పడతాయో అంచనా వేయచ్చని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. పెద్ద భూభాగాలు, పర్వతాలు, ధ్రువ మైదానాలు లాంటివి ఏర్పడవచ్చని వెల్లడించారు. గతంలో మంచుఫలకాలు కరిగినప్పుడు పెద్ద సరస్సులు ఏర్పడ్డాయని వివరించారు. హిమానీనదాలు సూర్యరశ్మిని ప్రతిబింబించడంలో, విద్యుత్‌ ఉత్పత్తి, తాగు, సాగు నీరు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మంచుఫలకాలు కరిగిపోయిన తర్వాత ఏ రకమైన పర్యావరణ వ్యవస్థలు మిగులుతాయో అంచనా వేయడం తమ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. ఉత్తరార్ధగోళంలో ఈ వేసవిలో ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఇవి భవిష్యత్తులో మరింత ఆందోళనకర ఫలితాలను అందివచ్చని తెలిపారు.Himalayan Glaciers: ముంచుకొస్తున్న ముప్పు

Tags:    

Similar News