USA : అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీలో భారీ బ్లాస్ట్

Update: 2025-07-19 06:16 GMT

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీలో భారీ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు షెరీఫ్ డిప్యూటీలు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం (జులై 18) లాస్ ఏంజెల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ బిస్కైలుజ్ ట్రైనింగ్ అకాడమీలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణించిన ముగ్గురు డిప్యూటీలు ఆర్సన్, ఎక్స్‌ప్లోజివ్స్ విభాగానికి చెందినవారని, వారికి 74 సంవత్సరాల సర్వీసు అనుభవం ఉందని లాస్ ఏంజెల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా తెలిపారు.

ఈ పేలుడు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇది శిక్షణలో భాగంగా పార్కింగ్ స్థలంలో మందుగుండు సామగ్రిని తరలిస్తుండగా జరిగిన ప్రమాదం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎఫ్‌బిఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ (ATF) అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. లాస్ ఏంజెల్స్ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ చరిత్రలో 1857 తర్వాత ఒకే ఘటనలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి అని షెరీఫ్ లూనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ పేలుడుతో శాంటా మోనికాలోని ఒక అపార్ట్‌మెంట్‌కు సంబంధం ఉన్నట్లు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు ముందు రోజు అంటే గురువారం శాంటా మోనికాలోని ఒక గ్యారేజీలో కొన్ని పేలుడు పదార్థాలు (గ్రెనేడ్‌లు) కనుగొన్నట్లు సమాచారం. ఈ గ్రెనేడ్‌లను షెరీఫ్ డిపార్ట్‌మెంట్ బిస్కైలుజ్ ట్రైనింగ్ అకాడమీకి తరలించినట్లు తెలుస్తోంది. వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నంలోనే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేలుడు తర్వాత లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ బాంబ్ స్క్వాడ్, ATF, FBI, LASDతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ శాంటా మోనికాలోని ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అనంతరం ఇంకా ఏమైనా పేలుడు పదార్థాల ఉన్నాయా? అని తనిఖీలు చేపట్టింది.

Tags:    

Similar News