Israel: ఇజ్రాయెల్ సైన్యం పొరపాటు.. ముగ్గురు బందీలు బలి
పొరపాటు జరిగిందని ప్రకటన;
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. హమాస్‌ను తుదముట్టించమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్నది. ఈ క్రమంలో హమాస్ బందీలుగా ఉన్నవారిలో ముగ్గురు ఇజ్రాయిలీలను ఐడీఎఫ్ కాల్చి చంపింది. అయితే పొరపాటును గుర్తించిన సైన్యం స్వయంగా వెల్లడించింది. షెజైయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలపై కాల్పులు జరిపాం. దీంతో వారు మృతి చెందారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. జరిగిన తప్పిదం నుంచి పాఠాలు నేర్చుకుంటామని ప్రకటన విడుదల చేసింది. మృతుల్లో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫార్ అజా ప్రాంతానికి చెందిన యోటమ్ హైమ్ కాగా, మరొకరు నిర్ అమ్ ప్రాంతానికి చెందినవారిగా సైన్యం గుర్తించింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మూడో వ్యక్తి పేరును వెల్లడించడం లేదని తెలిపింది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసింది. దీంతో 1200 మందికిపైగా ప్రజలు మరణించారు. మరో 240 మందిని బందీలుగా చేసుకున్నది. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 18,700 మందికిపైగా మరణించినట్లు హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారందరిని విడిపిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బందీలుగా ఉన్న సొంత పౌరులనే ఐడీఎఫ్ చంపడం గమనార్హం.
ఉగ్రవాదులు ఎక్కడా దాక్కున్న వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేస్తోంది. హమాస్ చెరలో ఉన్న బందీలను రక్షించడమే తమ లక్ష్యమంటూ గాజా స్ట్రిప్‌లో దాడులు కొనసాగిస్తోంది. బందీలుగా ఉన్న వారందరినీ స్వదేశానికి తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 18,700 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని వెల్లడించింది. ఇంకా వేలాది మంది తప్పిపోయారని.. శిథిలాల కింద చిక్కుకుపోయారని పేర్కొంది. గాజాపై యుద్ధం ఆపాలని.. మానవాత సాయం చేసేందుకు వీలు కల్పించాలని అంతర్జాతీయ సంస్థలు, అమెరికా కోరుతున్నా.. హమాస్‌పై విజయం సాధించేవరకు వెనక్కి తగ్గేదిలేదంటూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.