అక్రమంగా కిలో గంజాయి రవాణా.. భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉరి

1 కిలో గంజాయిని అక్రమంగా రవాణా చేసినందుకు సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉరితీశారు.

Update: 2023-04-26 09:38 GMT

1 కిలో గంజాయిని అక్రమంగా రవాణా చేసినందుకు సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉరితీశారు. దోషిగా తేలిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తికి సింగపూర్ ఉరిశిక్షను అమలు చేసింది. రాష్ట్రంలో మరణశిక్షను రద్దు చేయాలని అంతర్జాతీయ సంస్థల పిలుపు నేపథ్యంలో ఈ ఉరిశిక్షను అమలు చేశారు. సింగపూర్‌లోని చాంగి జైలు కాంప్లెక్స్‌లో బుధవారం ఉరితీసినట్లు అధికారులు తెలిపారు. ఉరిశిక్షను "అత్యవసరంగా పునరాలోచించాలని" సింగపూర్ ప్రభుత్వాన్ని కోరుతూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయంతో సహా అంతర్జాతీయ సంస్థలు విస్తృతంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉరి తీయడం జరిగింది. 

2017లో 1,017.9 గ్రాముల గంజాయిని అక్రమంగా రవాణా చేసినందుకు తంగరాజును దోషిగా ఉన్నాడు. అతనికి 2018లో మరణశిక్ష విధించబడింది. ఈ నిర్ణయాన్ని అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది. దోషి కుటుంబం క్షమాపణ కోసం విజ్ఞప్తి చేసింది, పునర్విచారణ కోసం ఒత్తిడి చేసింది. అయినా అవేవీ పని చేయలేదు. సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రగ్ వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను వ్యతిరేకిస్తూ కఠిన చర్యలు అమలులో ఉంటాయి. అయితే, UN యొక్క మానవ హక్కుల హైకమిషనర్ (OHCR) కార్యాలయం సింగపూర్ ప్రభుత్వ వాదనను ఖండించింది.

"మరణశిక్షను ఇప్పటికీ తక్కువ సంఖ్యలో వివిధ దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఇది నేరాలను అరికడుతుందనేది అపోహ మాత్రమే అని OHCHR ఒక ప్రకటనలో తెలిపింది. రెండు సంవత్సరాల విరామం తర్వాత సింగపూర్ మార్చి 2022లో ఉరిశిక్షలను పునఃప్రారంభించింది. ఇప్పుడు తంగరాజుకు ఉరిశిక్ష విధించడం ఈ పన్నెండు నెలల కాలంలో ఇదే మొదటిది. సింగపూర్ పొరుగు దేశమైన, థాయ్‌లాండ్ డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ఇప్పటికే ఉరిశిక్షను రద్దు చేసింది. ఈ విషయంలో థాయ్‌ని అనుసరించాలని సింగపూర్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

Tags:    

Similar News