Global Trade Crisis: హర్మూజ్‌ తరువాత మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..

మొత్తం వాణిజ్యంలో దాదాపు 12 శాతం ఈ మార్గం గుండానే..

Update: 2026-03-16 01:44 GMT

 అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో చమురు, గ్యాస్‌ రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసిన నేపథ్యంలో భారత్‌ సహా అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. చమురు ధరలు మండుతున్నాయి. దేశంలో ఎల్పీజీ సంక్షోభం తలెత్తింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మరో పిడుగులాంటి వార్త ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్నది. ఇంధన రవాణాకు కీలకమైన మరో జలసంధి బాబ్‌ అల్‌-మండెబ్‌ను మూసివేస్తామని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తున్నది. ఇదే జరిగితే, ప్రపంచం మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా దాడులు చేస్తున్న క్రమంలో హౌతీలు కూడా యుద్ధంలోకి దిగుతారా? అని సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్‌ పెంచి పోషించిన యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు యుద్ధంలోకి దిగితే, కీలకమైన జలమార్గం బాబ్‌ అల్‌ మండెబ్‌ను మూసివేయడం ఖామయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌ యుద్ధం విషయంలో ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరించిన హౌతీలు తాజాగా కీలక ప్రకటన చేశారు. తమ వేళ్లు ట్రిగ్గర్‌పై ఉన్నాయని హెచ్చరించారు. పరిణామాలు చేయిదాటితే, తాము కూడా యుద్ధంలోకి దిగుతామని ప్రకటించారు.

హౌతీల ఎంట్రీ..

యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ మిలిటెంట్ గ్రూప్ ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇరాన్ మద్దతుతో నడిచే ఈ దళాలు, అమెరికా మరియు ఇజ్రాయెల్ వ్యూహాలను దెబ్బతీసేందుకు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నాయి. ‘ట్రిగ్గర్ పై మా వేళ్లు సిద్ధంగా ఉన్నాయి’ అంటూ వారు చేస్తున్న హెచ్చరికలు ప్రపంచ వాణిజ్య రంగాన్ని వణికిస్తున్నాయి. ఇది ఇరాన్ మూడంచెల వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ హౌతీలు ఈ మార్గాన్ని అడ్డుకుంటే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులను సృష్టించగలదు.

ఎందుకు  కీలకం?

బాబ్‌ అల్‌ మండెబ్‌ అంటే గేట్‌ ఆఫ్‌ టియర్స్‌ (కన్నీటి ద్వారం) అని అర్థం. ఇది ఎర్ర సముద్రాన్ని గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌, హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. యూరప్‌, ఆసియా మధ్య సూయజ్‌ కాలువ గుండా వెళ్లే ఏ నౌక అయినా ఈ జలసంధిని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ జలసంధి గుండా వెళ్లకపోతే, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ గుండా అవి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్తే, 20-25 రోజుల ఆసియా-యూరప్‌ ప్రయాణం కాస్తా 30-40 రోజులకు పెరుగుతుంది. సుమారు 12% ప్రపంచ వాణిజ్యం, 10% ఆయిల్‌, ఎల్‌ఎన్‌జీ రవాణా ఈ కారిడార్‌ ద్వారానే జరుగుతుంది.

మూసేస్తే ఏంటి పరిస్థితి?

ఒకవేళ బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధిని హౌతీలు మూసేస్తే, ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావం పడనున్నది. ఇప్పటికే హొర్ముజ్‌ జలసంధి మూసివేతతో ఆయిల్‌ ఎగుమతులకు అంతరాయం ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. బాబ్‌ అల్‌ మండెబ్‌లో ఎలాంటి అస్థిరత పరిస్థితులు నెలకొన్నా, కంటెయినర్‌ షిప్పింగ్‌పై ప్రభావం పడి ఇంధన ధరలు మరింతగా పెరుగుతాయి. అంతేగాకుండా గ్లోబల్‌ సప్లయ్‌ చెయిన్‌ కూడా తెగిపోతుంది. ఆసియా, యూరప్‌ మధ్య రవాణా అయ్యే ఎలక్ట్రానిక్స్‌, మెషినరీ, ఆహార ఉత్పత్తులు, కన్జూమర్‌ గూడ్స్‌ సరఫరాలో జాప్యం ఏర్పడుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి.

Tags:    

Similar News