భారత్‌-చైనా మధ్య చర్చలు.. చర్చల ప్రారంభానికి ఒక రోజు ముందే చైనాకు షాక్

Update: 2020-09-21 12:24 GMT

భారత్‌-చైనా మధ్య కోర్ కమాండర్ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. వీటిలో సైనిక అధికారులతోపాటు విదేశాంగ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు ఆక్రమణలకు పాల్పడడం చైనాకు అలవాటే. కానీ ఈసారి చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చర్చల ప్రారంభానికి ఒక రోజు ముందే మన సైన్యం చైనాకు షాకిచ్చింది. చుషూల్ సెక్టార్‌లోని ఆరు శిఖరాలను స్వాధీనం చేసుకుంది. దీంతో చైనా కీలక స్థావరాలు భారత్‌ ఆధీనంలోకి వచ్చినట్లైంది. ఊహించని ఈ పరిణామంతో చైనాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగింది.

మన సైన్యం చైనా నుంచి ఆరు శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఆగస్టు 29 నుంచి ఈ నెల రెండో వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి మన సైన్యం తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. మగర్‌ హిల్‌, గురుంగ్‌ హిల్‌, రిసెహెన్‌ లా, రెజంగ్‌ లా, మొఖ్పారీ, ఫింగర్‌ 4 సమీపంలో మరో ఎత్తయిన ప్రాంతం మన సైన్యం స్వాధీనం చేసుకున్నవాటిలో ఉన్నాయి. వీటిలో గురుంగ్ హిల్ అత్యంత కీలకమైంది. ఎందుకంటే చైనా సాయుధ వాహనాలు చుషూల్ సెక్టార్‌లోకి ప్రవేశించాలంటే స్పంగూర్ గ్యాప్‌ నుంచే రావాలి. అది గురుంగ్ హిల్‌లోనే ఉంది. ఇప్పుడు మన సైన్యం స్పంగూర్‌ గ్యాప్‌పై పూర్తిస్థాయి పట్టు సాధించింది. దీంతో చుషూల్ సెక్టార్‌లోకి వచ్చే చైనాకు చెందిన ఏ వాహనమైనా... మన భద్రతా దళాల కన్నుగప్పి వెళ్లలేదు. మరోవైపు పాంగాంగ్ సరస్సువైపు ఉన్న ఫింగర్ 4 వద్ద అత్యధిక ఎత్తులో మన సైన్యం పట్టు సాధించింది. దీంతో కింద ఉన్న చైనా పోస్టులు భారత్ గురి పరిధిలో ఉన్నాయి.

Tags:    

Similar News