ఇరాన్ లో మారణహోమం.. ఆపకపోతే కష్టమే..!

Update: 2026-01-16 05:04 GMT

ఇరాన్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు రక్తపాతంగా మారాయి. పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రజల జీవన వ్యయంపై పడుతున్న తీవ్ర ప్రభావం, ప్రభుత్వ అణచివేత చర్యలు కలిసి ఇరాన్‌ను ఒక ప్రమాదకర దశకు తీసుకువెళ్లాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు, చమురు ఎగుమతులపై పరిమితులు, నిరుద్యోగం పెరగడం వల్ల సామాన్య ప్రజలు నిత్యావసరాలకే ఇబ్బంది పడుతున్నారు. ధరల పెరుగుదల, జీతాల్లో స్థిరత్వం లేకపోవడం ప్రజల్లో అసహనాన్ని పెంచింది. ఈ పరిస్థితుల్లో అవినీతికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. ప్రారంభంలో శాంతియుతంగా సాగిన ఈ నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి.

ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. ఆర్మీ జోక్యం తర్వాతే అసలు మారణహోమం మొదలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనధికారిక వర్గాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 12 వేల మందివరకు మరణించినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా 2500 మంది మాత్రమే చనిపోయారని చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలను ట్రంప్ బహిరంగంగానే ఎంకరేజ్ చేస్తున్నాడు. ట్రంప్ వ్యాఖ్యలు అక్కడి అశాంతికి మరింత ఆజ్యం పోస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్‌ను తన ఆధిపత్యంలోకి తీసుకురావడానికే ట్రంప్ ఈ కుట్రలు చేస్తున్నాడని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్‌పై ప్రత్యక్ష దాడికి కూడా ట్రంప్ ప్రయత్నించే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్, ఇప్పుడు రాజకీయంగా, సైనికంగా ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ముస్లిం దేశాలు ఇరాన్‌కు బలమైన మద్దతుగా నిలిస్తే ట్రంప్ ప్రణాళికలు ఫలించవని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ ఒంటరిగా కాకుండా ఇస్లామిక్ దేశాల ఐక్యతతో ముందుకు వస్తే అమెరికా ఒత్తిడిని తట్టుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక మరోవైపు ట్రంప్ నిర్ణయాలు భారత్‌కూ ముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌పై భారీగా టారిఫ్‌లు విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడన్న వార్తలు ఆర్థిక వర్గాల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పుడే ఈ విషయాన్ని కట్టడి చేయకపోతే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగుమతులు తగ్గడం, వాణిజ్య లోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News