India Bangladesh: బంగ్లాదేశ్‌కి భారత్ భారీ షాక్..
బంగ్లా వస్తువుల దిగుమతులపై పోర్ట్ ఆంక్షలు..;
బంగ్లాదేశ్‌కి భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై పోర్టు ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి రెడీమెడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వంటి కొన్ని దిగుమతులపై ఆంక్షలు పెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్‌కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది. గతంలో యూనస్ చేసిన వ్యాఖ్యల ఫలితంగానే భారత్ ఈ చర్యలు తీసుకుంటుంది. చైనా పర్యటనలో యూనస్ మాట్లాడుతూ, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ‘‘ల్యాండ్ లాక్డ్’’గా ఉన్నాయని అన్నారు.
ఈ నోటిఫికేషన్‌లో ‘‘రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు మొదలైన కొన్ని వస్తువులను బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకోవడంపై పోర్ట్ పరిమితులు విధిస్తుంది’’ అని మంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే, పోర్ట్ పరిమితులు భారతదేశం గుండా రవాణా అయ్య నేపాల్, భూటాన్ చేరే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించదు.
పండ్లు, కార్బోనేటేడ్-పండ్ల-రుచిగల పానీయాలు, స్నాక్స్, బేక్డ్ గూడ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్,PVC వస్తువులు, పత్తి , పత్తి నూలు వ్యర్థాలు, రంగులు, ప్లాస్టిసైజర్లు, గ్రాన్యూల్స్ , చెక్క ఫర్నిచర్ వంటి వస్తువుల అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్‌లోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (LCSలు), ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు (ICPలు) ద్వారా దిగుమతులు అనుమతించబడవని ఉత్తర్వులు పేర్కొన్నాయి. అయితే, ఈ ఆంక్షలు చేపలు, ఎల్‌పీజీ, వంట నూనె వంటి వాటికి వర్తించవు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని DGFT తెలిపింది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతంలో, చైనా పర్యటనలో యూనస్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి రక్షకుడని, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్ బంగ్లాదేశ్‌కి ఇస్తున్న ‘‘ట్రాన్స్ షిప్‌మెంట్’’ సౌకర్యాన్ని రద్దు చేసింది.