Center Advisory : హర్మూజ్‌లో చిక్కుకున్న భారత నావికులకు అత్యవసర హెచ్చరిక
నౌకల నుంచి బయటకు రావొద్దని కేంద్ర సూచన.. ఉద్రిక్తతలతో జలసంధి మళ్లీ మూసివేత
హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర అడ్వయిజరీ జారీ చేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్ పరిసర జలాల్లో ఉన్న భారత నావికులు సున్నితమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ఆదేశించింది. నౌకలలోనే ఉండి భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరింది.
నిరంతర సంప్రదింపులు కీలకం
నావికులు ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది. కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని తెలిపింది.
మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిన హర్మూజ్
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది.
నౌకలు వెనుదిరిగిన పరిస్థితి
జలసంధిని దాటేందుకు సిద్ధమైన అనేక నౌకలు తిరిగి వెనక్కి మళ్లాయి. గ్రీక్‌కు చెందిన ‘ఎన్‌జే ఎర్త్’, లైబీరియా జెండా కలిగిన ‘డేటోనా బీచ్’ వంటి నౌకలు దాటినప్పటికీ, మరికొన్ని నౌకలు మధ్యలోనే నిలిచిపోయాయి. ‘ఏయూరోరా’ నౌక కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెనుదిరిగినట్లు సమాచారం. లెబనాన్‌పై జరిగిన దాడుల్లో వందలాది మంది మరణించడం, దానికి ప్రతిగా ఇరాన్ చర్యలు తీసుకోవడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్షోభ దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో భారత నావికుల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.mమొత్తంగా, హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు స్థిరపడే వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.