Modi Zelensky: సెప్టెంబర్‌లో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ.. భేటీకానున్న మోదీ-జెలెన్‌స్కీ

ఫోన్ కాల్ లో .. ఏం చర్చించారంటే..!;

Update: 2025-08-12 01:00 GMT

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. ఈ మేరకు ఇద్దరు నేతలు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత అంతర్జాతీయ దౌత్య పరిస్థితిని చర్చించినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు హృదయపూర్వక మద్దతు ఇచ్చిన మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రష్యా దాడులపై మోదీకి వివరించినట్లు చెప్పారు. రష్యా సైన్యం ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలను ఎలా లక్ష్యంగా చేసుకుంటుందో చెప్పారు. డజన్ల కొద్దీ జనం గాయపడిన జపోరిజియా బస్ స్టేషన్‌పై దాడిని సైతం ప్రస్తావించారు.

ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగినట్లుగా ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన అవకాశం ఉందన్నారు. రష్యా కాల్పుల విరమణకు సుముఖత చూపడానికి బదులుగా ఆక్రమణ, హత్యలను కొనసాగించాలని చూస్తోందని.. శాంతిని పునరుద్ధరించేందుకు చేస్తున్న తన ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధించిన అన్ని సమస్యలను ఉక్రెయిన్ భాగస్వామ్యంతో మాత్రమే పరిష్కరించాలని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్చల ఇతర ఫార్మాట్స్‌ అసమర్థమైనవని ఆయన అభివర్ణించారు. అలాంటి ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని అన్నారు. ఈ సంభాషణలో ఇద్దరు నాయకులు రష్యాపై విధించిన ఆంక్షలపై సైతం చర్చించారు. రష్యా ఆర్థిక సామర్థ్యాన్ని తగ్గించుకోవడానికి, యుద్ధం కొనసాగింపుకు ఆర్థిక సహాయం చేయలేని విధంగా రష్యా ఇంధనం, ముఖ్యంగా చమురు ఎగుమతిని పరిమితం చేయడం అవసరమని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యాను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ప్రతి నాయకుడు మాస్కోకు సరైన సందేశాన్ని పంపాలని కోరారు.

సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా వ్యక్తిగతంగా సమావేశమయ్యేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్వీట్‌లో స్పందిస్తూ.. ఇటీవల పరిణామాలను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. రష్యాతో వివాదాన్ని, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని.. ఈ విషయంలో సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 15న అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భేటీకి ముందు ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అలాస్కాకు ఆహ్వానించే విషయాన్ని వైట్‌హౌస్‌ పరిశీలిస్తున్నట్లుగా ఓ నివేదిక తెలిపింది.

Tags:    

Similar News