UK Gurdwara : బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌కు నిరసన సెగ
గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డగింత..;
స్కాట్లాండ్ లో ఓ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని, కాన్సుల్ జనరల్ ను అడ్డుకోవడంపై భారత్ స్పందించింది. ఇది అవమానకరమైన ఘటన అని పేర్కొంది. ఇదంతా స్థానికేతర అతివాద గ్రూపులు చేసిన పనేననీ, గురుద్వారా కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది. పెద్ద ఘటన జరగకముందే భారత అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. నిర్వాహకుల్లో ఒకరు తక్షణం స్పందించకపోయి ఉంటే విషయం మరింత తీవ్రమయ్యేదని వ్యాఖ్యానించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బహిర్గతమైంది. భారత్ తరఫున ఎవరొచ్చినా వారితో ఇలాగే వ్యవహరిస్తామని , వీడియోలో ఖలిస్తాన్ సానుభూతి పరులు మాట్లాడటం కనిపించింది. దీనిపై శిరోమని గుర్ ద్వారా ప్రబందక్ కమిటీ స్పందించింది. గురుద్వారాలు అన్ని మతాలకు చెందినవనీ ఇలాంటి ఘటన జరగడం విచారకరమని పేర్కొంది.
బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామికి చేదు అనుభవం ఎదురైంది. స్కాట్లాండ్లో గురుద్వారాలోకి ప్రవేశించకుండా కొందరు ఆయణ్ను అడ్డుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సమావేశం కాబోతున్నారన్న విషయం తమకు ముందుగానే తెలిసిందని ఓ ఖలిస్థానీ సానుభూతిపరుడు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దొరస్వామి గురుద్వారా వద్దకు రాగానే బ్రిటన్‌లోని అతివాద సిక్కులు కొందరు ఆయన్ను అడ్డుకున్నారని తెలిపాయి. ‘గురుద్వారాకు మీకు ఆహ్వానం లేదు’ అని వారు దొరస్వామితో చెప్పారని సమాచారం. ఫలితంగా అక్కడ స్వల్ప ఘర్షణ జరిగిందని.. యూకేలో ఉన్న ఏ గురుద్వారా లోపలికీ భారతీయ అధికారులకు స్వాగతం ఉండదని చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. గ్లాస్‌గోవ్‌లోని ఆల్బర్ట్ రోడ్డులో ఉన్న గురుద్వారా వద్దకు దొరైస్వామి చేరుకుంటున్న సమయంలో.. ఖలిస్తానీ కార్యకర్తలు అడ్డుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. హై కమీషనర్ కారు పార్కింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు.కారు డోర్‌ను ఓపెన్ చేసేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆ కారు గురుద్వారా వద్ద ఆగకుండానే వెళ్లిపోయింది.