Singapore: 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. భారత సంతతి వ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్ష!
80 వేల సింగపూర్ డాలర్లు చెల్లించి బెయిలుపై విడుదల;
సింగపూర్‌లో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతికి చెందిన రామలింగం సెల్వశేఖరన్‌కు సింగపూర్ హైకోర్టు 14 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించింది. 58 ఏళ్ల రామలింగం 2021 అక్టోబర్ 28న జూరాంగ్ వెస్ట్‌లోని తన ప్రొవిజన్ షాప్‌లో ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డాడు.
ఐస్‌క్రీమ్ కొనడానికి రామలింగం దుకాణానికి వచ్చిన బాలికను షాప్ వెనుక భాగానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని ప్రాసిక్యూషన్ వివరించింది. ఈ భయంకరమైన ఘటన అనంతరం బాలిక ఒక సమీప వ్యక్తి సహాయంతో ధైర్యంగా పోలీసులకు సమాచారం అందించింది. జనవరి 16న ప్రారంభమైన విచారణలో రామలింగం స్వయంగా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, జూలై 7న అతడిపై అత్యాచారం, రెండు లైంగిక వేధింపుల ఆరోపణలపై నేరం నమోదైంది.
రామలింగం తన అస్వస్థత (ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్) కారణంగా అత్యాచారం సాధ్యం కాదని, బాధితురాలిపై తన డీఎన్‌ఏ ఆనవాళ్లు లేవని వాదించాడు. అయితే, జస్టిస్ ఐడాన్ జు బాలిక సాక్ష్యం ఎంతో విశ్వసనీయంగా, స్థిరంగా ఉందని తీర్పునిచ్చారు. రామలింగం పోలీసులకు ఇచ్చిన మొదటి వాంగ్మూలంలో బాధితురాలిని హత్తుకోవడం, ముద్దు పెట్టడం, లైంగిక చర్యలకు పాల్పడినట్టు అంగీకరించాడు. కానీ తర్వాత ఆ వాదనలను తిరస్కరించడం కేవలం తన నేరాన్ని అంగీకరించకుండా తప్పించుకునే ప్రయత్నమని న్యాయమూర్తి నిర్ధారించారు. తనకు విధించిన శిక్షపై అప్పీలు చేస్తానని రామలింగం పేర్కొనడంతో 80 వేల సింగపూర్ డాలర్లు చెల్లించి బెయిలుపై విడుదలయ్యాడు.