Forex Reserves : భారత్ ఖజానా ఫుల్.. ఆల్-టైమ్ హైకి చేరిన విదేశీ మారక నిల్వలు.

Update: 2026-02-21 05:45 GMT

Forex Reserves :భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక అద్భుతమైన వార్త వెలుగులోకి వచ్చింది. దేశ విదేశీ మారక నిల్వలు సరికొత్త రికార్డును సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మన దేశ ఖజానా కళకళలాడుతోంది. భారత రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 13తో ముగిసిన వారానికి మన ఫారెక్స్ నిల్వలు ఏకంగా 8.66 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం 725.727 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది మన దేశ చరిత్రలోనే ఆల్-టైమ్ హై లెవల్ కావడం విశేషం.

నిజానికి ఫిబ్రవరి 6తో ముగిసిన వారం నాటికి ఈ నిల్వలు కాస్త తగ్గి 717.064 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ కేవలం ఒక్క వారంలోనే భారీగా పెరగడం గమనార్హం. విదేశీ కరెన్సీ ఆస్తులు కూడా ఈ వారంలో 3.55 బిలియన్ డాలర్లు పెరిగి 573.603 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ నిల్వలు మన దేశానికి ఎంతటి భరోసా ఇస్తున్నాయంటే.. దాదాపు ఏడాది కాలం పాటు మనకు కావాల్సిన వస్తువుల దిగుమతులకు లేదా మనం చెల్లించాల్సిన విదేశీ అప్పుల్లో 96 శాతానికి ఇవి సరిపోతాయని ఆర్‌బీఐ ధీమా వ్యక్తం చేసింది.

ఇక మన ఖజానాలో బంగారం వాటా కూడా గణనీయంగా పెరిగింది. గత వారం తగ్గుముఖం పట్టిన గోల్డ్ రిజర్వ్స్ వాల్యూ, ఈ వారం ఏకంగా 4.99 బిలియన్ డాలర్లు పెరిగి 128.466 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బంగారం విలువ పెరగడం మనకు కలిసి వచ్చింది. విదేశీ పెట్టుబడిదారులు కూడా భారత మార్కెట్లపై నమ్మకం చూపిస్తున్నారు. ముఖ్యంగా యూరప్, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల తర్వాత పెట్టుబడుల ప్రవాహం పెరిగి రూపాయి విలువ నిలకడగా ఉండటం మన ఫారెక్స్ నిల్వలు పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి.

మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత దేశం తన ఆర్థిక పునాదులను పటిష్టం చేసుకుంటోంది. ఈ భారీ నిల్వలు ప్రపంచ దేశాల ముందు భారత్ ఆర్థిక సత్తాను చాటి చెబుతున్నాయి. రూపాయి బలపడటం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తిరిగి రావడం వల్ల మున్ముందు ఈ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సానుకూల పరిణామాలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కూడా సహాయపడతాయి.

Tags:    

Similar News