Iran: ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు..
పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్‌కు చేరుకున్నాయి. దీంతో భద్రతా దళాలు అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.
టెహ్రాన్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి "సర్వాధికారికి మరణం" అంటూ నినాదాలు చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవం కంటే ముందు ఇరాన్‌ను పాలించిన షా మహమ్మద్ రెజా పహ్లావీ కుమారుడు రెజా పహ్లావీకి నిరసనకారులు మద్దతు పలకడం విశేషం. ప్రస్తుతం అమెరికాలో ప్రవాసంలో ఉన్న రెజా పహ్లావీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ "విజయం మనదే.. ఎందుకంటే మన పోరాటం న్యాయమైనది" అంటూ నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు.
ఇరాన్ రియాల్ విలువ డాలర్‌తో పోలిస్తే సగానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం 42.5 శాతానికి చేరడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లోర్డెగాన్, కుహదాష్త్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరుగుతోంది. కుహదాష్త్‌లో జరిగిన ఘర్షణలో బాసిజ్ పారామిలిటరీ దళానికి చెందిన అమీర్ హొస్సామ్ ఖోదయారీ ఫర్ద్ అనే వ్యక్తి మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు.
పరిస్థితి విషమిస్తుండటంతో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవైపు భద్రతా చర్యలు చేపడుతూనే, మరోవైపు చర్చలకు సిద్ధమని ప్రకటించింది. వర్తక సంఘాల ప్రతినిధులతో నేరుగా మాట్లాడతామని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమా మొహజెరానీ తెలిపారు. కాగా, నిరసనకారులను అణచివేయడానికి ఇరాన్ ఇంటర్నెట్ సేవలను కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిపివేసింది.