International Moon day : చందమామ కథలు..
చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ..;
జీవితంలో మనకి ఎదురు పడే ప్రియాతి ప్రియమైన వాటిలో చందమామ ఒకటి. అలాంటి చంద్రుడిపై మనిషి కాలుమోపి ఐదు దశాబ్దాలకు పైగానే కాలం గడచిపోయింది. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన వ్యక్తి ఎవరంటే టక్కున చెప్తాం. అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్.
నిజానికి చంద్రుడిని చేరుకోవాలనేది మనిషి చిరకాల స్వప్నం. అవకాశం ఉంటే చంద్రలోకంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని ఎంతోమంది కలలు కంటుంటారు. అయితే ఆనాడు చంద్రుని మీద కాలు మోపిన తర్వాత మళ్లీ ఇప్పటివరకు అక్కడ పూర్తిగా ఉండే అవకాశాన్ని పొందలేదు. అయినా సరే అందీ అందకుండా ఊరిస్తున్న చందమామపై దేశదేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలను మానుకోలేదు. చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడంతో గత ఏడాది తొలిసారిగా అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి రెండవాది.
ఈసారి అంతర్జాతీయ చంద్ర దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఎంచుకున్న అంశం ‘చంద్రునిపై అన్వేషణలో సమన్వయం, సుస్థిరత’. చంద్రునిపై అన్వేషణలోను, పరిశోధనల్లోను వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సమన్వయం, పరిశోధనల్లో సుస్థిరత కోసం ఐక్యరాజ్య సమితి ఈ అంశాన్ని ఎంపిక చేసుకుంది. చంద్రుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మరిన్ని అడుగులు మునుముందుకు వేయాలి. శాస్త్రవేత్తలు ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక్కో అడుగు ముందుకు వేసినప్పుడల్లా చంద్రుడి గురించి ఒక్కో కొత్త విశేషాలను తెలుసుకుని, మానవాళికి వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చంద్రయాన్–3 ప్రయోగాన్ని చేపట్టింది. దీనికి ముందు చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది.
తొలి రోజుల్లో అమెరికా, సోవియట్ రష్యా చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాల్లో పోటాపోటీగా ప్రయోగాలు చేసాయి. దాదాపు అరడజను ప్రయోగాలు విఫలమైన తర్వాత తొలిసారిగా సోవియట్ రష్యా చంద్రుడి మీదకు 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో అదే ఏడాది సెప్టెంబర్ 12న సోవియట్ రష్యా ప్రయోగించిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రుణ్ణి చేరుకుంది. ఇక అప్పటి నుంచి చంద్రుడి విశేషాలను తెలుసుకునేందుకు పలు దేశాలు ప్రయోగాలను సాగిస్తూనే ఉన్నాయి.
అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1969 జూలై 16న ‘అపోలో–11’ ప్రయోగం చేపట్టింది. దీని ద్వారా ఇద్దరు వ్యోమగాములు– నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపైకి చేరుకున్నారు. జూలై 20న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు మోపి చరిత్ర సృష్టించాడు. ఈ ఇద్దరు ధీరులను గౌరవిస్తూ అంతరిక్షంలోకి వారి అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఈ చంద్రుని దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.