పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. డ్రోన్‌తో దాడి చేయడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో భారీగా పొగలు ఎగసిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సెంట్రల్ దుబాయ్‌లోని ఒక భవనంపై క్షిపణి శకలాలు పడటంతో భవనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు దుబాయ్ మీడియా ధృవీకరించింది. యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defence Systems) ఇరాన్ నుండి వచ్చిన 10 బాలిస్టిక్ క్షిపణులను, 26 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయని అక్కడి మీడియా ప్రకటించింది. ఈ క్రమంలోనే గగనతలంలో పేలుళ్లు సంభవించి శకలాలు కిందకు పడ్డాయి. ముఖ్యంగా షేక్ జాయెద్ రోడ్, డౌన్‌టౌన్ దుబాయ్ సమీపంలోని భవనాలపై ఈ శకలాలు పడినట్లు సమాచారం.
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సాగుతుండగా.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు సాగిస్తున్నాయి.