TRUMP: పాత చింతకాయ పచ్చడి అంశం ఎందుకు ట్రంప్..?
కమలా హారిస్‌పై ట్రంప్ జాతిపర వ్యాఖ్యలు... తిప్పికొట్టిన కమలా హారిస్.;
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశమున్న కమలా హారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జాతిపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె భారతీయురాలా.. ఆఫ్రో అమెరికనా అని ప్రశ్నించారు. దీనిపై వెంటనే కమలా హారిస్ స్పందించారు. ఆయన పాత చింతకాయ పచ్చడిలాంటి అంశాన్ని లేవనెత్తుతున్నారని, విభజన వాదానికి ఆజ్యం పోస్తున్నారని, వ్యక్తులను అగౌరవపరుస్తున్నారని ధ్వజమెత్తారు. షికాగోలో జరిగిన సదస్సులో ఆఫ్రో అమెరికన్లపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఓ మహిళా జర్నలిస్టు గుర్తు చేయంగా.. ట్రంప్ ఆమెపై రుసరుసలాడారు. ఆమె ఒక మూర్ఖురాలు అని తిట్టిపోశారు. లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ నేతలు కమలా హారిస్ అనే తోలుబొమ్మను ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. విరాళాలిచ్చే దాతలు, రాజకీయ దళారుల నియంత్రణలో ఆమె పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నాలుగు వారాల కిందట అత్యంత చెత్త ఉపాధ్యక్షురాలిగా ఆమెను పేర్కొన్నారని, ఒక్కసారిగా ఆమెను మార్గరెట్ థాచర్‌లా మార్చేశారని వ్యాఖ్యానించారు.
ఆమె వల్లే బతికా
పెన్సిల్వేనియా ప్రచార సభలో తాను మాట్లాడుతున్న సమయంలో.. దుండగుడు కాల్పులు జరపడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన సంఘటనను ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ‘‘కంప్యూటర్ సెక్షన్ సిబ్బందిలో ఒక మహిళ వలసదారుల చార్ట్‌ను స్క్రీన్‌పై ప్రదర్శించింది. దాన్ని చూసేందుకు నా తలను అటు వైపుగా తిప్పా. ఆ సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. అంతలోనే నా తలకు బదులు చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమె వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను.’’ అని అన్నారు. హారిస్‌బర్గ్ ప్రచార సభలో ఆ మహిళను వేదిక పైకి పిలిచి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను ‘కంప్యూటర్ జీనియస్’ అంటూ కొనియాడారు. కాగా.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తనపై హత్యాయత్నం జరిగిన ఘటన అనంతరం తొలిసారి ప్రచారంలో పాల్గొన్నారు. కాల్పులు జరిపిన చోటే మళ్లీ ఈ ర్యాలీని నిర్వహించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.