Antonio Guterres On Palestine : పాలస్తీనా అణిచివేత వ్యాఖ్యలపై దుమారం

రాజీనామా చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్​

Update: 2023-10-25 02:30 GMT

పాలస్తీనాను ఇజ్రాయెల్ 56 ఏళ్లుగా అణచివేస్తోందన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. ఐరాస చీఫ్ గా గుటెరస్ తన పదవికి రాజీనామా చేయాలని ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ డిమాండ్ చేశారు. హమాస్ చేసిన సామూహిక హత్యలపై కనికరం చూపే వ్యక్తి ఐరాస సెక్రటరీజనరల్ గా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నారని ఐరాస చీఫ్ ను ప్రశ్నించారు.

పాలస్తీనాను 56 ఏళ్లుగా ఇజ్రాయెల్ అణచివేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. హమాస్ ఇటీవల చేసిన దాడి ఒక్కసారిగా జరిగింది కాదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఐరాస భద్రతామండలి మినిస్టీరియల్ సదస్సులో పాల్గొన్న ఆయన.. 56 ఏళ్లుగా పాలస్తీనీయులపై అణచివేత సాగుతోందని వివరించారు. ఇజ్రాయెల్ చేసే సెటిల్ మెంట్లు, హింసతో పాలస్తీనీయులు తమ సొంత భూమిని కోల్పోయారని ఐరాస చీఫ్ తెలిపారు. పాలస్తీనా ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందనీ ఇళ్లులేక నిరాశ్రయులయ్యారనీ తమ సమస్యకు రాజకీయ పరిష్కారం దొరుకుతుందన్న ఆశ.. పాలస్తీనా ప్రజల్లో సన్నగిల్లిందని ఐరాస చీఫ్ పేర్కొన్నారు. హమాస్ దాడుల పేరిట పాలస్తీనీయులను శిక్షించడం సరైంది కాదని హితవు పలికారు. దీనికి 2 దేశాల ఏర్పాటే సరైన పరిష్కారమని తెలిపారు. పరమత వ్యతిరేకతతో స్వమత దురహంకారాన్ని పంచే శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గాజాలో పరిస్థితి దారుణంగా ఉందనీ ఐరాస శిబిరాల్లో ఏకంగా 6 లక్షల మంది తలదాచుకున్నారని గుటెరస్ పేర్కొన్నారు. 


గుటెరెస్ చేసిన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కోహెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుటెరెస్ పై వేలెత్తి చూపుతూ... ఆయనపై మండిపడ్డారు. మిస్టర్ సెక్రెటరీ జనరల్, మీరు ఏ ప్రపంచంలో బతుకుతున్నారని ప్రశ్నించారు. హమాస్ చేసిన సింగిల్ అటాక్ లో తమ దేశానికి చెందిన ఎంతో మంది పిల్లలతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గాజా ఆక్రమణ కోసమే ఈ దాడులు అనే వ్యాఖ్యలపై కోహెన్ స్పందిస్తూ... 2005లో పాలస్తీనీయులకు గాజాను చివరి మిల్లీమీటర్ వరకు ఇజ్రాయెల్ అప్పగించిందని చెప్పారు.

మరోవైపు, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... గుటెరెస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిలో కనీసం 1,400 మంది చనిపోయారు. 220 మందికి పైగా ప్రజలను బందీలుగా తీసుకెళ్లారు. దీంతో గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటి వరకు కనీసం 5,700 మంది పాలస్తీనీలు ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యారు.

Tags:    

Similar News