Israel-Hamas war: అత్యవసరాలతో గాజాకి చేరిన వాహనాలు
పిండి, మందులు, ఇతర పదార్థాలను తీసుకునేందుకు ఎగబడుతున్న ప్రజలు;
గాజాపట్టిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, భూతల దాడులు తీవ్రతరం చేసింది. ఉత్తర గాజాను ఖాళీ చేయాలని కొన్ని రోజుల క్రితమే హెచ్చరించిన ఇజ్రాయెల్ మిలటరీ ఇప్పుడు ఏకంగా గాజా నగరం శివార్ల వరకు చొచ్చుకువెళ్లింది. గాజా నగరానికి ఇరువైపుల నుంచి ఇజ్రాయెల్ భూతల దాడికి దిగింది. ఉత్తరగాజా నుంచి దక్షిణ గాజాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు చేరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఉత్తర, మధ్య గాజా ప్రాంతాల్లోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంక్‌లు దూసుకెళ్లాయి. సైనికుల భద్రత దృష్ట్యా యుద్ధ ట్యాంకులు గాజాలో ఎక్కడ వరకూ వెళ్లాయో చెప్పేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెర్స్ IDF నిరాకరించింది. గాజాలో తమ సైనిక కార్యకలాపాలను విస్తరించినట్లు మాత్రం తెలిపింది. అదనపు సైనికులు, ట్యాంకులు, ఇంజినీరింగ్ యూనిట్లు, ఆర్టిలరీ బలగాలను గాజా పంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఉత్తరగాజా నుంచి దక్షిణ గాజా వెళ్లే రహదారిని ఇజ్రాయెల్ సైన్యం మూసివేయడంతో వాహనాలన్నీ తిరిగి వెళ్లిపోతున్నాయి.
ఉత్తరగాజాలో ఉన్న 10 ఆస్పత్రులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించినా అది సాధ్యం కాదని ఐరాస తేల్చి చెప్పింది. ఉత్తరగాజాలోని ఆస్పత్రుల్లో లక్షా 17 వేల మంది తలదాచుకుంటున్నారు. రోగులు సహా ప్రజలు ఆస్పత్రుల నుంచి ఖాళీ చేయడం సాధ్యంకాదని ఐరాస తెలిపింది. అయితే ఆస్పత్రి సమీపంలోని ప్రాంతాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. ఆస్పత్రికి సమీపంలోనే హమాస్ మిలిటెంట్ల కమాండ్ సెంటర్లు ఉన్నాయని ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. గత కొద్దిరోజులుగా హమాస్ మిలిటెంట్లకు చెందిన 600 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. భవనాలు, సొరంగాలపై దాడులు చేసి పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు వెల్లడించింది.
కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ హెచ్చరించడంతో 10 లక్షల మందికిపైగా పాలస్తీనా పౌరులు ఉత్తరగాజాను వీడగా ఇంకా చాలా మంది అక్కడే ఉంటున్నారు. తమ ఇళ్లను కోల్పోతామన్న భయంతో వారు ఉత్తరగాజాలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజా వెళ్లే రహదారిని ఇజ్రాయెల్ మూసివేయడంతో పాలస్తీనా పౌరులు తరలివెళ్లే అవకాశం కూడా లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాపట్టీలో 8 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రి శాఖ వెల్లడించింది. ఇందులో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. 14 లక్షల మంది ప్రజలు గాజాలో తమ ఇళ్లను వీడి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇజ్రాయెల్‌పైకి పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తూనే ఉన్నారు. మరోవైపు రాకెట్ దాడుల కారణంగా గాజా, లెబనాన్ సరిహద్దుల్లో ఉంటున్న రెండున్నర లక్షల మంది ఇజ్రాయెల్ పౌరులు కూడా తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.