Israel- Iran Conflict: ఖమేనీని అంతం చేయాలనుకున్నాం, గాలించాం, కానీ, దొరకలేదు : ఇజ్రాయెల్
సుదీర్ఘకాలం పాటు ఖమేనీ బంకర్లలో ఉండాలి, బయటకు వస్తే చస్తాడు: ఇజ్రాయెల్;
ఇరాన్‌తో యుద్ధ సమయంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ ప్రకటించారు. కానీ, తమకు సరైన అవకాశం లభించక పోవడంతో అందులో విఫలమైనట్లు తెలిపాడు. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. తాము హత్య చేసే ప్రణాళికను క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఆయన మాకు అందుబాటులోకి వస్తే.. అతడ్ని బయటకు తెచ్చే వాళ్లమని ఖట్జ్ పేర్కొన్నారు. దీంతో టెహ్రాన్ అగ్ర నాయకత్వాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది.
అలాగే, ఐడీఎఫ్ దళాలు, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో ఇరాన్ అణు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని టెల్ అవీవ్ పేర్కొంది. కానీ, ఇప్పుడు ఇరాన్ నాయకత్వాన్ని చంపడానికి యత్నించినట్లు తేలింది. హెజ్‌బొల్లా చీఫ్ నస్రుల్లా లాగే సుదీర్ఘకాలం బంకర్లోనే ఉండాలని తాము ఖమేనీకి సూచిస్తున్నామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు.. అతడ్ని చంపడం మాకు ఈజీ.. కానీ, మేము ఆయన్ను చంపబోమని జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఇక, ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ దేశ ప్రజల ఖమేనీ ఎక్కడ అని ప్రశ్నించడంతో.. జూన్ 26న తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాన్ని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ గురువారం నాడు ప్రసారం చేసింది. 10 నిమిషాల పాటు సాగినా ఈ వీడియోలో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుప్రీంనేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.