Gaza : గాజాలో ఆగని మృత్యుఘోష
ఇజ్రాయెల్ దాడుల్లో 50 వేలకుపైగా పాలస్తీనియన్ల మృతి;
గాజాలో పాలస్తీనియన్ల మరణాలు 50వేలు దాటినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో 26 మంది మరణించారు. మృతుల్లో పాలస్తీనియన్ పార్లమెంట్, పొలిటికల్ బ్యూరో సభ్యుడు, హమాస్ రాజకీయ నేత సలా బర్దావిల్, అతని భార్య కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. యుద్ధంలో ఇప్పటివరకు 1,13,000 మంది గాయపడ్డట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
2023 అక్టోబరు 7న హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఖాన్ యూనిస్ నగరంపై ఆదివారం ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో హమాస్ కీలక నేత సలాహ్ అల్ బర్దావీల్(66) మృతి చెందారు. ఆయన భార్య కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించిన బర్దావీల్.. హమాస్ సీనియర్ నేత యాహ్యా సిన్వర్‌కు సన్నిహితుడు. హమాస్ రాజకీయ విభాగానికి నాయకుడు కూడా. ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్, ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి బర్దావీలే హమాస్‌లో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు.
గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించేందుకు కొత్త డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనికి ఆ దేశ మంత్రిమండలి శనివారం ఆమోదం తెలిపింది. గాజా నుంచి పాలస్తీనియన్లు జోర్డాన్, ఈజిప్టు తదితర దేశాలకు శాశ్వతంగా తరలివెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్.. ఇందుకోసం ఒక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం గమనార్హం.