Benjamin Netanyahu: గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 104 మంది పాలస్తీనియన్ల మృతి

హమాస్ కు బుద్ధి చెప్పేందుకే ప్రతి దాడులు చేస్తున్నామని వెల్లడి

Update: 2025-10-30 06:15 GMT

గాజాలో మరోసారి బాంబుల మోత మోగుతోంది.. ఇజ్రాయెల్ నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రశాంతత తాజాగా చెదిరిపోయింది. అయితే ఇందుకు కారణం హమాస్ ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో మళ్లీ దాడులు ప్రారంభించింది. తాము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నప్పటికీ హమాస్ పదే పదే ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ప్రతీకార దాడులు చేయక తప్పడం లేదని వివరణ ఇచ్చింది. తాజాగా బుధవారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో గాజాలో 104 మంది మరణించినట్లు సమాచారం.

దక్షిణ గాజాలో ఉన్న తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే తాము మళ్ళీ యుద్ధం ప్రారంభించామని నెతన్యాహు తెలిపారు. తమ సైనికుడిని హమాస్ చంపేయడంతో టెర్రర్ గ్రూపులపై దాడులు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడుల్లో ఇప్పటి వరకు 104 మంది పాలస్తీనా పౌరులు చనిపోగా మరో 250 మందికి గాయాలయ్యాయి. అయితే, నెతన్యాహు ఆరోపణలను హమాస్ ఖండించింది. తమవైపు నుంచి ఎలాంటి కాల్పులు జరగకున్నా స్కూళ్ళు, ఇళ్ళపై ఐడీఎఫ్ బాంబులు వేస్తోందని ఆరోపించింది.

Tags:    

Similar News