Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని అబేను చంపిన నిందితుడికి జీవితకాల జైలుశిక్ష
సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసిన 45 ఏళ్ల టెట్‌సుయా యమగామికి జీవితకాల జైలుశిక్ష పడింది. నారా జిల్లా కోర్టు ఆ శిక్షను ఇవాళ ఖరారు చేసింది. మాజీ ప్రధానిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. జపాన్ అధికార పార్టీ, వివాదాస్పద దక్షిణకొరియా చర్చి మధ్య సంబంధాలను వ్యతిరేకిస్తూ నిందితుడు మాజీ ప్రధాని హత్యకు ప్లాన్ చేశాడు. జపాన్ రాజకీయాల్లో అత్యధిక కాలం ప్రధానిగా చేసిన వ్యక్తిగా అబెకు రికార్డు ఉన్నది. అయితే ప్రధాని హోదాను విడిచిన తర్వాత ఆయన ఎంపీగా కొనసాగారు.
నారా సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అబేపై 2022లో కాల్పులు జరిపారు. గన్ కంట్రోల్‌పై పట్టు ఉండే జపాన్‌లో ఆ ఘటన జరగడం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. వివాదాస్పద చర్చితో లింకున్న గ్రూపులో అబే ఓ వీడియో మెసేజ్ షేర్ చేశారని, ఆ మెసేజ్ చూసిన తర్వాత మాజీ ప్రధాని హత్యకు ప్లాన్ వేసినట్లు నిందితుడు తెలిపారు. చర్చి విధానాలను వ్యతిరేకించిన నింతుడు మాజీ ప్రధానిని టార్గెట్ చేసుకున్నాడు.
వాస్తవానికి యునిఫికేషన్ చర్చి నేతను నిందితుడు తొలుత చంపాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత తన ప్లాన్‌ను మార్చుకుని అబేను టార్గెట్ చేశాడు. యునిఫికేషన్ చర్చిని తన తల్లి గుడ్డిగా నమ్మిందని, ఆ చర్చికి అంతులేని రీతిలో దానాలు చేసిందని, దాని వల్ల తన కుటుంబం నాశనమైందని, ఈ నేపథ్యంలోనే ఆ చర్చి గ్రూపుకు సపోర్టు ఇస్తున్న అబేను చంపాలని భావించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. మతపరమైన సంస్థలు సైకలాజికల్‌గా, ఆర్థికంగా మద్దతుదారులను వాడుకుంటున్న తీరు, అలాంటి గ్రూపులతో నేతలకు ఉన్న లింకులపై విమర్శలు వస్తున్నాయి.