Judge Frank Caprio : అమెరికాకు చెందిన ప్రముఖ జడ్జి ఫ్రాంక్‌ కాప్రియో కన్నుమూత

సోషల్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించిన కుటుంబీకులు..!;

Update: 2025-08-21 07:45 GMT

అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయమూర్తి, ప్రపంచంలోనే అత్యంత దయగల జడ్జిగా నిలిచిన ఫ్రాంక్ కాప్రియో  కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడిన ఆయన, చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు సోష‌ల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘కాట్ ఇన్ ప్రొవిడెన్స్’ అనే రియాలిటీ కోర్ట్ షో ద్వారా కాప్రియో లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. తన మరణవార్తను ప్రకటిస్తూ, ఆయన కుటుంబ సభ్యులు ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ‘దయ, వినయం, మానవత్వంపై ఆయన పట్టు, ఆశీర్వాదం అనేక జీవితాలను ప్రభావితం చేసింది. ఆయన ప్రేమ, హాస్యం, కరుణ ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా ముద్రవేసాయి’ అని ప్రకటనలో పేర్కొన్నారు. మరణానికి ఒక రోజు ముందు, కాప్రియో ఆసుపత్రి నుంచి ఒక వీడియోలో తన ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. ‘ఈ కష్టమైన పోరాటం కొనసాగిస్తున్నా. మీ ప్రార్థనలు నాకు బలాన్ని ఇస్తాయి’ అని ఆయన తన అభిమానులను కోరారు.

1936లో రోడ్ ఐలాండ్‌లోని ప్రావిడెన్స్‌లో జన్మించిన కాప్రియో.. అమెరికాలోని ప్రొవిడెన్స్ మున్సిపల్ కోర్టులో దశాబ్దాల పాటు పనిచేసిన కాప్రియో.. ప్రత్యేకమైన తీర్పులతో గుర్తింపు పొందారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ట్రాఫిక్ టిక్కెట్లు రద్దు చేయడం, నిందితులకు శిక్షతో పాటు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పడం వంటి చర్యలతో విశేష గుర్తింపు పొందారు. ఆయన కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. పెద్ద ఎత్తున వ్యూస్‌ వస్తుంటాయి. 2018 నుంచి 2020 వరకు ప్రసారమైన ‘కాట్ ఇన్ ప్రొవిడెన్స్’ షో.. అనేక డేటైమ్ ఎమ్మీ నామినేషన్స్‌ను అందుకుంది. ఆయన న్యాయాన్ని కేవలం చట్టంతో మాత్రమే కాకుండా, దయ, గౌరవం, మానవత్వం చూపించే వారు. 2023లో పాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి కాప్రియో స్వయంగా వెల్లడించారు. కాప్రియో మృతిపై రోడ్ ఐలాండ్ గవర్నర్ డాన్ మెక్కీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనను ‘రోడ్ ఐలాండ్ రాష్ట్రానికి నిజమైన నిధి’ అని అభివర్ణించారు. ఆయన గౌరవార్థం రాష్ట్రంలోని జెండాలను అవనతం చేయాలని గవర్నర్‌ ఆదేశించారు.

Tags:    

Similar News