Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ నియామకం.. ట్రంప్ వార్నింగ్

"అతను ప్రశాంతంగా జీవించలేడు" అంటూ ఘాటు హెచ్చరిక

Update: 2026-03-10 23:24 GMT

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైన మొజ్తబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. "అతను ప్రశాంతంగా జీవించగలడని నేను అనుకోవడం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి తర్వాత ఆయన కుమారుడైన 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీని కొత్త అధినేతగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇరాన్ ఈ నాయకుడిని ఎన్నుకోవడంపై నేను సంతోషంగా లేను. అతను ప్రశాంతంగా బతకలేడు" అని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ నియామక ప్రక్రియలో వెనెజువెలా తరహాలోనే తన ప్రమేయం కలిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, ఖమేనీ విధానాలు గత పాలకుల మాదిరే కొనసాగితే ఐదేళ్లలో మరో యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. "ఆ పదవిలో కొనసాగాలంటే అతను మా అనుమతి తీసుకోవాలి. లేకపోతే ఎక్కువ కాలం ఉండలేడు" అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. 

కాగా.. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తున్నాయి.. ఇరాన్‌కు ఆర్థిక వ్యవస్థకు జీవనాడి చమురు డిపోలపై వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని దక్షిణ టెహ్రాన్ ప్రాంతంలోని కీలకమైన టోండ్‌గౌయాన్ ఆయిల్ రిఫైనరీతో పాటు మొత్తం మూడు ప్రధాన చమురు డిపోలపై బాంబుల వర్షం కురిపించింది. టోండ్‌గౌయాన్ ఆయిల్ రిఫైనరీపై దాడి ఇరాన్‌ కూడా కన్ఫామ్‌ చేసింది. ఇరాన్ మిలటరీకి ఇక్కడ నుంచే చమురును సరఫరా చేస్తుందని, అలాంటి చముల నిల్వలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.

ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్ అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికా సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌ మరోసారి తమపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు కువైట్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు ప్రజలు తీవ్రంగా గాయపడగా.. అనేక భవనాలు దెబ్బతిన్నాయని తెలిపింది. డ్రోన్ల శకలాలు పడడంతో నగరంలోని సోషల్‌ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్నట్లు వెల్లడించింది. దాడులు కొనసాగుతున్నందున సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని కువైట్‌ సైన్యం ప్రజలకు సూచించింది. 

Tags:    

Similar News