Crude Oil : ఇరాన్ యుద్ధం క్లైమాక్స్‌కు చేరింది.. ట్రంప్ సంచలన ప్రకటనతో భారీగా తగ్గిన క్రూడాయిల్ ధర.
Crude Oil : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని, చాలా త్వరలోనే శాంతి నెలకొంటుందని ఆయన ప్రకటించారు. ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని బందీగా మార్చాలని చూసే ఏ ఉగ్రవాద పాలనను తాము సహించబోమని హెచ్చరించారు. ఇరాన్ గనుక ప్రపంచ చమురు సరఫరాకు అడ్డుతగిలితే, ఆ దేశం ఎప్పటికీ కోలుకోలేని విధంగా అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా చిన్నాభిన్నం చేశామని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇస్రాయెల్ సహకారంతో అమెరికా తన సైనిక ప్రతాపాన్ని చూపి శత్రువును అణిచివేస్తోందని ఆయన అన్నారు. ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్లు, మిస్సైల్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామని, వారి నౌకాదళాన్ని సముద్ర గర్భంలో కలిపేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన 46 యుద్ధ నౌకలను కూల్చివేశామని, ఆ దేశంలోని కీలక ఉగ్రవాద నాయకులను మట్టుబెట్టామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ఇరాన్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తాము ఇంకా లక్ష్యంగా చేసుకోలేదని, ఒకవేళ ఆ దేశం మొండిగా వ్యవహరిస్తే వాటిని కూడా పేల్చివేస్తామని, అప్పుడు అవి మళ్ళీ కోలుకోవడానికి ఏళ్లు పడుతుందని హెచ్చరించారు.
యుద్ధం ముగియడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఉన్న ముప్పు తప్పుతుందని, తద్వారా అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్ విశ్లేషించారు. గల్ఫ్ దేశాల మీదుగా ప్రయాణించే చమురు ట్యాంకర్లకు అమెరికా పూర్తి భద్రత కల్పిస్తుందని, నౌకాదళం ద్వారా ట్యాంకర్లను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. చమురు ధరలను అదుపులో ఉంచేందుకు ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా సడలిస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు ట్యాంకర్లకు పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో అమెరికా పాత్ర ఉండాలని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. "మళ్ళీ ఐదేళ్ల తర్వాత లేదా పదేళ్ల తర్వాత మనం ఇదే పరిస్థితిలో చిక్కుకోకూడదు. అందుకే ఇరాన్ భవిష్యత్తు నాయకత్వంపై మేము దృష్టి సారించాం" అని ఆయన అన్నారు. మధ్యప్రాచ్యాన్ని ఆక్రమించి ఇస్రాయెల్‌ను అంతం చేయాలన్న ఇరాన్ ప్లాన్‌ను తాము సరైన సమయంలో అడ్డుకున్నామని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. శత్రువు పూర్తిగా ఓడిపోయే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అమెరికా మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దేశమని, ఉగ్రవాదుల బెదిరింపులకు లొంగబోదని ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.