Lukashenko: పుతిన్ ను ఆపింది నేనే

పుతిన్, వాగ్నర్ గ్రూప్ ను నాశనం చేయకుండా ఆపిన బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో;

Update: 2023-06-28 09:30 GMT

రష్యాలో ఉన్నట్టుండి తిరుగుబాటు జెండాను ఎగరవేసిన వాగ్నర్ గ్రూప్ రెండు రోజులతరువాత సైలెంట్ అయిపోయింది. దీంతో యుద్ధానికి సిద్ధమైన రష్యా సైన్యం కూడా వెనక్కు తగ్గింది. అయితే వాగ్నర్ గ్రూప్ అలా వెనక్కు తగ్గడానికి కారణం బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో. ఇదే విషయాన్ని రష్యాసైతం ప్రకటించింది.

ప్రిగోజిన్ తో లుకషెంకో చర్చలు జరిపి వెనక్కు తగ్గేలా చేశాడు. తాజాగా పుతిన్, ప్రిగోజిన్ మధ్య సయోధ్య కు సంబంధించిన వివరాలను లుకషెంకో వివరించారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచిపోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్. ఆ సైన్య అధినేత యెవెగెనీ ప్రిగోజిన్ రష్యా పైనే తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపింది. రెండు రోజుల పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఉన్నట్లుండి వాగ్నర్ సైన్యం తిరుగుబాటు జెండాను దింపేసి వెనక్కి వెళ్లిపోయింది. వాగ్నర్ గ్రూప్ ను అడ్డుకొనేందుకు అప్పటికే సిద్ధమైన రష్యా సైన్యం కూడా సైలెంట్ అయిపోయింది.

అయితే దీనికి కారణం తానే అంటున్నారు బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో. అతను చెప్పిన వివరాల బట్టి చూస్తే వాగ్నర్ గ్రూపును నాశనం చేయాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు. అయితే తొందరపడొద్దని పుతిన్ ను కోరిన లుకషెంకో, ప్రిగోజిన్, అతడి కమాండర్లతో మాట్లాడమని సలహా ఇచ్చాడట. పుతిన్ అందుకు మొదట అసలు అంగీకరించలేదట. కానీ రక్తపాతం జరగకుండా చూసేందుకు తనే ఇద్దరితోనూ మాట్లాడి, ఒకరు చెప్పేవి ఇంకొకరికి అర్థం అయ్యే విధంగా చేరవేసి సయోధ్య కుదిర్చానని లుకషంకో చెప్పారు.

Tags:    

Similar News