Mark Zuckerberg: భార్యకు జుకర్‌బర్గ్ స్పెషల్ గిఫ్ట్..

ప్రేమ శిల్పం బహుమతిగా ఇచ్చిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌;

Update: 2024-08-14 23:15 GMT

ఫేస్‌బుక్‌  సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన భార్య ప్రిస్సిల్లా చాను పై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అపూర్వ కానుక ఇచ్చారు. రోమన్‌ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని చెక్కించి బహుమతిగా ఇచ్చారు.

టెక్‌ దిగ్గజం, మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సోషల్‌ మీడియా యాక్టివిటీ చూస్తే ఆయనో ఫ్యామిలీమ్యాన్‌ అని అర్థమవుతుంది. బిజినెస్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా తన పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని కోడింగ్ నేర్పుతుంటారు. ఇప్పుడు తన సతీమణి ప్రిస్కిలా చాన్‌  పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఆమెకో అపూర్వ కానుకను బహూకరించారు. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఆ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

రోమన్‌ సంప్రదాయంలో ప్రిస్కిలా చాన్‌  విగ్రహాన్ని రూపొందించి ఇంటి పెరట్లో ఆవిష్కరించారు. నీలి రంగులో వెండి వస్త్రం పరిచినట్టుగా దానిని తీర్చిదిద్దారు. ఆ భారీ విగ్రహం పక్కన ఆమె నిల్చొని ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘‘భార్య విగ్రహాన్ని చెక్కే రోమన్ సంస్కృతిని తిరిగి తీసుకొచ్చాం’’ అని రాసుకొచ్చిన ఆయన.. దాని రూపకర్త డేనియల్ అర్షమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ప్రిస్కిలా ఫన్నీగా కామెంట్‌ చేశారు. మీరు నన్ను మిస్‌ కాలేరింక.. అంటూ పోస్టు పెట్టారు. వారి ప్రేమను మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

2003లో హార్వర్డ్‌ యూనివర్సిటీలో మొదటిసారి కలుసుకున్న జుకర్‌బర్గ్‌, ప్రిస్కిలా చాన్‌  ల మధ్య  ప్రేమ చిగురించింది.  తరువాత  కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ‘ఆగస్ట్’ జన్మించింది. ఇక గతేడాది అంటే 2023 మార్చిలో మరో పాప అరేలియా చాన్‌కు ప్రిస్సిల్లా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News