Masood Azhar: భారత్‌లో మారణ హోమం సృష్టించిన మసూద్ మృతి ?
స్పందించని పాక్ ప్రభుత్వం,...;
భారత్‌కు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ హతమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల భవల్‌పూర్ మసీదుకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై బాంబు దాడికి పాల్పడినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో మసూద్ అజహర్ అక్కడికక్కడే మరణించాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై పాక్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పాక్ మీడియాలోనూ దీనిపై వార్తలు రాలేదు. కాగా, మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఇదివరకే ప్రకటించింది. మసూద్ పాక్‌లోనే ఉంటున్నాడనే వాదనలు ఉన్నాయి. అయితే దీన్ని పాకిస్థాన్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ మసూద్ మరణించినా.. దానిపై పాక్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు. పాకిస్థాన్‌లో గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్న ఘటనలు చోటుచేసుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న మసూద్ మృతి వార్తకు ప్రాధాన్యం సంతరించుకొన్నది. పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ అగ్రనేతగా మసూద్ ఉన్నాడు.
అయితే మసూద్ అజహర్‌పై దాడి జరిగినట్లు ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ దాడిలో మసూద్ అజహర్ హతం అయ్యాడనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ వీడియో పాతది అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలో ఓ మార్కెట్‌లో పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఆ పేలుడు సమయంలో మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
భారత్‌లో జరిగిన పలు భీకర దాడులకు ప్రధాన సూత్రధారి మసూద్ అజహర్. 1995లో భారత్ అతడిని అరెస్టు చేసింది. 1999లో విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు అతడిని విడిపించుకెళ్లారు. ఆ తర్వాత కక్ష కట్టిన మసూదర్ జైషేను స్థాపించాడు. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ మసూద్ అజహర్ ప్రమేయం ఉంది. అలాగే 2019 జమ్మూకశ్మీర్ పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి వెనుక మసూద్ మాస్టర్‌మైండ్ ఉందన్న ఆరోపణాలు ఉన్నాయి. పుల్వామా ఘటనలో40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఐక్యరాజ్యసమితి .. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.