ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పాకిస్తాన్ లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్న తమకు ఏమీ తెలియదు అన్నట్లుగా తప్పించుకు తిరుగుతోంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ , లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్‌లు పాకిస్తాన్ లోనే ఉన్నారని భారత్ చెబుతున్న పాక్ మౌనం వహిస్తోంది. తాజాగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో మళ్లీ పాత పాటే పాడారు.
ఓ ఇంటర్నేషనల్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ మాట్లాడుతూ.. “మసూద్ అజార్ పాక్‌లో ఎక్కడున్నాడో మాకు తెలియదు. భారత్ సమాచారమిస్తే.. మేం సంతోషంగా అరెస్ట్ చేస్తాం’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మసూద్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండొచ్చని అన్నారు. అక్కడ అమెరికా చేయలేని పనిని.. మేం ఎలా చేస్తామని వ్యాఖ్యానించారు. హఫీజ్ సయీద్ విషయంలోనూ అలానే మాట్లాడారు. హఫీజ్ సయీద్ ప్రజలమధ్య తిరుగుతున్నట్టు చెప్పడంలో నిజం లేదన్నారు. అతను ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నాడని చెప్పారు.
ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టి.. పీఓకే లోని జైషే, లష్కరే తోయిబా స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమవ్వగా మసూద్ అజార్ కుటుంబ సభ్యుల్లో 10 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో బిలావల్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయని భారత అధికారులు అంటున్నారు. మసూద్ అజార్ పేరు అనేక ఉగ్రదాడుల కేసుల్లో నమోదై ఉంది. 1995లో అతడిని భారత్ అరెస్టు చేసినా, 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు విడిపించారు. అనంతరం జైషే మహ్మద్ ముఠాను స్థాపించిన మసూద్.. 2001 లో పార్లమెంట్ దాడి, 2008 లో ముంబయి పేలుళ్ల కు పాల్పడి ఎంతోమంది మృతికి కారణమయ్యాడు. 2019లో ఐక్యరాజ్యసమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.