Guinea : ఫుట్ బాల్ మ్యాచ్ లో మారణకాండ.. 100 మందికిపైగా మృతి

Update: 2024-12-03 13:30 GMT

పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం జరిగింది. ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పరం కొట్లాటకు దిగడంతో దాదాపు 100 మంది మరణించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఓ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం జరిగిన మ్యాచ్ రిఫరీ నిర్ణయం వివాదానికి దారితీసింది. రిఫరీ నిర్ణయంతో విభేదిస్తూ ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. ఆ వెంటనే ప్రత్యర్థి జట్టు అభిమానులు స్పందించారు. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ చెలరేగింది. తొక్కిసలాట జరిగింది.

ఓవైపు మైదానంలో గందరగోళం జరుగుతుండగా, ఇంకొకవైపు వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. కొందరేమో ఆగ్రహంతో పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులన్నీ రక్తసిక్త మయ్యాయి. ఎటు చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పరిస్థితి భీతావహంగా, భయానకంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దాదాపు 100 మంది మరణించారని స్థానిక ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఆఫ్రికా దేశాల్లో ఫుట్బాల్ అల్లర్లు తరచూ విషా దానికి దారితీస్తుంటాయి. గతంలోనూ జమైకాలో ఈ తరహా విషాదం నెలకొంది. ప్లెజెంట్ హైట్స్ ప్రాంతంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు.

Tags:    

Similar News